
ప్రచార ఆర్భాటం.. మెగా పీటీఎం
జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన మెగా పీటీఎం 2.0 సమావేశాలు కూటమి ప్రభుత్వం ప్రచారం కోసమే నిర్వహించినట్లు ఉందని విద్యావేత్తలు పెదవి విరిచారు. విద్యార్థులు పురోగతి, పాఠశాలల్లో నెలకొన్న సమస్యల నిమిత్తం నిర్వహించాల్సిన మెగా పీటీఎం సమావేశం ఉద్ధేశాన్నే మార్చేశారన్నారు. విద్యావ్యవస్థలో కూటమి పార్టీ ప్రచారం కోసం మెగా పీటీఎం సమావేశాలను పావుగా వాడుకున్నారన్న విమర్శ వచ్చింది. సమావేశాలకు తల్లిదండ్రులు గైర్హాజరు కావడంతో ఏదో నిర్వహించామంటే...నిర్వహించామనే ధోరణిలో మెగా పీటీఎం సమావేశాలు జరిపి, చేతులు దులుపుకున్నారు.
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 2,984 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం సమావేశాల్లో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం తప్ప ఇంకేమి కనిపించని పరిస్థితి నెలకొంది. మెగా పీటీఎం సమావేశం ఉద్దేశాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జిల్లాలో విద్యాభివృద్ధికి చేసిందేమి లేదు. అభివృద్ధి దిశగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలను పౌండేషన్ పాఠశాలల పేరుతో కిలోమీటర్ దూరంలో స్కూళ్లలో విలీనం చేసి విద్యార్థులకు నష్టం చేకూర్చారు. గత వైఎస్సార్‌సీపీ సర్కారు వేల కోట్లు ఖర్చు చేసి అమలు చేస్తున్న నాడు–నేడు పనులను నిర్వీర్యం చేశారు. ఇవన్ని ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులను ఏ మార్చేందుకు పబ్లిసిటీ స్టంట్ కోసం మెగా పీటీఎంలను నిర్వహించారనే విమర్శలు గుప్పుమంటున్నాయి.
ఆటల పోటీలు తప్ప..సాగని చర్చలు
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం సమావేశాలు మొదలు పెట్టినప్పటి నుంచి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆటల పోటీలు, డ్యాన్సులు చేయించారు. విద్యార్థులు విద్యలో ఎలా రాణిస్తున్నారు? ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు? వారి అభ్యున్నతికి చేపట్టే చర్యలేమిటి? పాఠశాల అభివృద్ధికి చేయాల్సిన పనులేమిటి? ఇలా పలు అంశాలపై చర్చలు జరపాల్సి ఉంటుంది. అయితే ఈ దిశగా చర్చలేమి మెగా పీటీఎం సమావేశాల్లో జరగని పరిస్థితి కనిపించింది. ఈ సమావేశాలకు కూటమి ఎమ్మెల్యేలు హాజరై గొప్పలు చేసేశామనే ధోరణిలో ప్రసంగాలు చేసి వెళ్లి పోయారు. దాదాపు 90 శాతం పైగా పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా వరకు పాఠశాలల్లో విద్యార్థుల పురోగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రాస్ కార్డులను సైతం ఇవ్వని పరిస్థితి నెలకొంది.
అధికంగా గైర్హాజరు
జిల్లాలోని 2,984 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిలో 20 శాతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం జాడే కనిపించని పరిస్థితులు నెలకున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం సమావేశాలకు 2,60,641 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి 2,894 మంది తల్లిదండ్రులు మాత్రం హాజరైనట్లు విద్యాశాఖ నివేదికలు పేర్కొన్నాయి. వీటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు ఈ సమావేశాల నిర్వహణ తీరు ఎలా సాగిందన్న విషయం. కాగా కూటమి ప్రభుత్వంలో రెండో విడత ఈ సమావేశాలు నిర్వహించారు. గతంలో మొదటి సారి నిర్వహించిన ఈ సమావేశాల్లో చర్చించిన సమస్యలేవి పరిష్కారం కాలేదని తల్లిదండ్రులు పెదవి విరిచారు. ఈ సమావేశాల వల్ల ఒరిగిందేమి లేదని తల్లిదండ్రులు విమర్శలు గుప్పించారు.
ప్రైవేట్, కార్పొరేట్‌లో ఇష్టానుసారం
జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో మెగా పీటీఎం 2.0 సమావేశాలను ఇష్టానుసారంగా నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. అయితే మధ్యాహ్నం వరకు కొన్ని పాఠశాలల్లో.. మరికొన్ని పాఠశాలల్లో 11.30 గంటలకే ముగించేశారు. అలాగే కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనలను భేఖాతర్ చేశారు. జిల్లాలోని నారాయణ, శ్రీచైతన్య పాఠశాలల్లో మెగా పీటీఎం అని కాకుండా పేర్లు మార్చి సమావేశాలు నిర్వహించి మమ అనిపించేశారు.
కూటమి ప్రచారం తప్ప ఒరిగిందేమి లేదు
సమావేశంలో చర్చకు రాని విద్యార్థుల పురోగతి
అధికంగా గైర్హాజరైన విద్యార్థులు, తల్లిదండ్రులు
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేరు మార్చి సమావేశాలు
జిల్లాలో మెగా పీటీఎం 2.0 నిర్వహణ సమాచారం
జిల్లాలో అన్ని యాజమాన్యాల
పాఠశాలలు, కళాశాలలు : 2,984
సమావేశాలకు రిజిస్టర్ చేసుకోని
పాఠశాలలు : 6
హాజరైన తల్లులు : 1,731
హాజరైన తండ్రులు : 1,112
హాజరైన సంరక్షకులు : 51
మొత్తం విద్యార్థులు : 2,60,641
హాజరైన విద్యార్థులు : 2,07,621
గైర్హాజరైన విద్యార్థులు : 53,020
కొన్ని ఉదాహరణలు ఇలా..
చిత్తూరు సంతపేటలోని పీఎన్‌సీ మున్సిపల్ పాఠశాలలో మొత్తం 409 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలలో నిర్వహించిన సమావేశానికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కొందరు తల్లిదండ్రులు కేంద్రీయ విద్యాలయ హామీ ఏమైంది సార్ అని ప్రశ్నించారు. ఇందుకు ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు మంజూరయ్యాయి అంటూనే చివర్లో చిన్న సమస్యతో పెండింగ్ పడింది. త్వరలోనే కేంద్రీయ విద్యాలయ హామీ నెరవేరుతుందన్నారు. 409 మంది తల్లిదండ్రులు హాజరుకావాల్సి ఉండగా 150 మంది విద్యార్థులు మాత్రం సమావేశానికి హాజరయ్యారు.
పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లి మండలం ఊటూరు ప్రాథమిక పాఠశాలలో నలుగురే విద్యార్థులున్నారు. ఆ నలుగురు విద్యార్థుల తల్లిదండ్రులు అర్ధగంట పాటు ఉండి వెళ్లిపోయారు.
నగరి నియోజకవర్గంలోని నగరి మండలం ఎం.కొత్తూరు జెడ్పీ హైస్కూల్‌లో 226 మంది విద్యార్థులుంటే 36 మంది తల్లిదండ్రులు మాత్రమే హాజరయ్యారు.
నగరి నియోజకవర్గంలోని చింతలపట్టెడ వినాయకపురం జెడ్పీ హైస్కూల్‌లో 175 మంది విద్యార్థులకుగాను ఐదుగురు తల్లులు మాత్రమే మెగా పీటీఎం సమావేశానికి హాజరయ్యారు. ఇదే పరిస్థితి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొంది.