
నివేదిక సిద్ధం చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పంచాయతీల్లో 2023–24లో జరిగిన వివిధ పనుల్లో 29 అంశాల పురోగతి పై నివేదికలు సిద్ధం చేయాలని జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు అన్నారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తదితర అధికారులతో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో సంబంధిత సంవత్సరంలో జరిగిన అభివృద్ధి, తాగునీరు, పారుశుద్ధ్యం ఇలా 29 అంశాలపై నివేదికలివ్వాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్‌రావు మాట్లాడుతూ 2023–24 సంవత్సరంలో పంచాయతీల్లో జరిగిన, జరగాల్సిన అభివృద్ధి పనులపై పూర్తి నివేదికను సేకరించారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆమె ల్యాబ్ టెక్నీషియన్లతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. రానున్నది వర్షాకాలమని, కురిసే వర్షాలకు దోమల ఉధృత్తి పెరగవచ్చన్నారు. దీనికితోడు సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశాలున్నాయన్నారు. ఇలాంటప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. వచ్చే జ్వరం కేసులను క్షుణంగా పరీక్షలు చేసి కచ్చితమైన రిపోర్టును ఇవ్వాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి వెంకటప్రసాద్, మలేరియా అధికారి వేణుగోపాల్ పాల్గొన్నారు.