
మామిడి విలవిల
● దిగజారుతున్న ధరలు ● అల్పోన్సో ధర పతనం ● కోతలు వద్దంటున్న ట్రేడర్‌లు
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : మళ్లీ మామిడి ధరలు పతనమయ్యాయి. బేనీషా ధర మరింత పతనానికి చేరుకుంది. ఇదే దారిలో అల్పోన్సో ధరలు పయనిస్తోంది. చందూర ధర దారుణంగా పడిపోయింది. కాయలను కొనేవారు లేక మార్కెట్‌లో కాయలు నిల్వలు పేరుకుపోయాయి.. దీంతో ట్రేడర్లు కోతలు వద్దని రైతులను నిలుపుదల చేయిస్తున్నారు. చిత్తూరు నగరం కట్టమంచిలోని మామిడి కాయల మార్కెట్ వెలవెలబోతోంది.
గత నాలుగు రోజులుగా మార్కెట్‌కు కాయలు రాకపోవడంతో వ్యాపారం డల్‌గా మారింది. శుక్రవారం 5 నుంచి 6 టన్నుల కాయలు వచ్చాయి. ఇందులో అధికంగా బేనీషా కాయలు ఉన్నాయి. ఈ బేనీషా మార్కెట్‌లో విక్రయాలు జరగక ట్రేడర్లు కుప్పలు పోసి పెట్టారు. రైతులకు కోతలు వద్దని నిలుపుదల చేసినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. కాగా ఇమామ్ పసంద్ ధరలు మాత్రం గిట్టుబాటు అవుతోంది. మిగిలిన టేబుల్ రకాల ధరలు మాత్రం పతనమవుతున్నాయి. ఇలా అయితే రైతుకు కోత కూలి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మామిడి ధరలు ఇలా...
మామిడి రకం ధర (రూ.లలో)
బేనీషా 10–20
చందూర 4–6
తోతాపురి(టేబుల్ రకం) 12
కాలేపాడు 20–30
మల్లిక 20–30
ఇమామ్ పసంద్ 50–60
అల్పోన్సో 20–30