‘ఇంటికి వచ్చేయండి.. భారత్ గర్వపడేలా చేద్దాం’ | Zoho Founder Indian IT Professionals Pride Over Green Card Delays | Sakshi
Sakshi News home page

‘ఇంటికి వచ్చేయండి.. భారత్ గర్వపడేలా చేద్దాం’

May 23 2026 2:05 PM | Updated on May 23 2026 2:31 PM

Zoho Founder Indian IT Professionals Pride Over Green Card Delays

అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తూ గ్రీన్ కార్డుల కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం జోహో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ సైంటిస్ట్ శ్రీధర్ వెంబు మరోసారి విజ్ఞప్తి చేశారు. పరాయి దేశంలో అనిశ్చితి మధ్య కాలం వెళ్లదీసే కంటే స్వదేశానికి తిరిగి వచ్చి దేశ వృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ‘దయచేసి మాతృభూమికి తిరిగి వచ్చేయండి. ఇది కొంత కష్టంతో కూడుకున్నది. త్యాగంతో కూడినదే కావచ్చు.. కానీ, జీవితంలో ఆత్మగౌరవం అనేదే మీ మార్గాన్ని నిర్దేశించాలి. అంతా కలిసి భారత్ గర్వపడేలా చేద్దాం’ అంటూ ఆయన ఎక్స్ ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఇటీవల గ్రీన్ కార్డ్ నిబంధనలపై చేసిన ఒక కఠినమైన ప్రకటనను ఉటంకిస్తూ శ్రీధర్ వెంబు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘తాత్కాలికంగా యూఎస్‌లో ఉంటూ, గ్రీన్ కార్డ్ కోరుకునే ఏ విదేశీయుడైనా సరే.. దరఖాస్తు ప్రక్రియ కోసం ముందుగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. మా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలోని లొసుగులను వాడుకోవడానికి బదులు, చట్టం తన పని తాను చేసుకుపోయేందుకే ఈ విధానాన్ని తెచ్చాం. దేశ వలస విధానాన్ని దుర్వినియోగం చేసే కాలం ఇక ముగిసింది’ అని యూఎస్‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.

డీహెచ్‌ఎస్‌ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా, ముఖ్యంగా అమెరికాలోని భారతీయ టెక్ ఉద్యోగుల్లో కలకలం రేపాయి. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లు, ఇమ్మిగ్రేషన్ అనిశ్చితి, హెచ్-1బీ వీసాదారుల భవిష్యత్తుపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలోనే శ్రీధర్ వెంబు స్పందిస్తూ భారతీయులకు స్వదేశీ పిలుపునిచ్చారు.

నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు

వెంబు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత దశాబ్ద కాలంలో భారతదేశంలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, ఏఐ ఇండస్ట్రీ, డిజిటల్ మౌలిక సదుపాయాలు అద్భుతంగా వృద్ధి చెందాయని పలువురు వెంబు వ్యాఖ్యలను సమర్థించారు. భారత్‌లోనే ఇప్పుడు అపారమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. భారతదేశంలో అమెరికా తరహా భారీ జీతాలు లేకపోవడం, అధిక పన్నులు, టాక్సిక్ వర్క్ కల్చర్, మౌలిక సదుపాయాల కొరత, జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో లేకపోవడాన్ని కొందరు ఎత్తి చూపారు.

‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనా

శ్రీధర్ వెంబు కేవలం పిలుపునివ్వడమే కాకుండా స్వయంగా ‘భారత్-ఫస్ట్’ వృద్ధి నమూనాను అమలు చేసి చూపిస్తున్నారు. సిలికాన్ వ్యాలీ తరహా కేంద్రీకృత మోడల్‌ను వ్యతిరేకించే ఆయన సాంకేతికతను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని ఆకాంక్షిస్తున్నారు. ఆయన నాయకత్వంలో జోహో తన కార్యకలాపాలను పెద్ద నగరాలకే పరిమితం చేయకుండా తమిళనాడులోని తెన్కాసి వంటి చిన్న పట్టణాలకు విస్తరించింది.

ఇదీ చదవండి: మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం?

Advertisement
 
Advertisement
Advertisement