మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం? | Cloudflare CEO Reveals Shocking Truth About AI Layoffs | Sakshi
Sakshi News home page

ఐటీలో మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ అంతం?

May 23 2026 11:51 AM | Updated on May 23 2026 12:00 PM

Cloudflare CEO Reveals Shocking Truth About AI Layoffs

సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న ప్రకంపనలు ఉద్యోగ మార్కెట్‌ను తిరగరాస్తున్నాయి. నిన్నటివరకు ఏఐ కేవలం క్లిష్టమైన కోడింగ్ లేదా క్రియేటివ్ పనులను మాత్రమే ప్రభావితం చేస్తుందని భావించిన కార్పొరేట్ లోకానికి క్లౌడ్ ఫ్లేర్ సీఈఓ మాథ్యూ ప్రిన్స్ షాకింగ్ నిజాలను వెల్లడించారు. ఏఐ కాలగర్భంలో కలిసిపోయే ఉద్యోగాలు ఏవి? భవిష్యత్తులో మనుగడ సాగించే విభాగాలు ఏమిటి? అనే అంశాలపై ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కంపెనీ అద్భుతమైన వృద్ధి రేటుతో దూసుకుపోతున్నప్పటికీ తమ ఉద్యోగుల్లో ఏకంగా 20 శాతానికి పైగా సిబ్బందిని తొలగించామని ప్రిన్స్ ప్రకటించడం ఐటీ రంగాన్ని విస్మయానికి గురిచేసింది.

ఆర్థిక సంక్షోభం కాదు.. ఏఐ తెచ్చిన మార్పు!

సాధారణంగా ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగించిందంటే దానికి ఆర్థిక నష్టాలు లేదా వ్యాపార మందగమనం కారణం అవుతుంది. కానీ, క్లౌడ్ ఫ్లేర్ కథ వేరు. కంపెనీ 30 శాతానికి పైగా బలమైన వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఉచిత నగదు ప్రవాహం కూడా బలంగా ఉంది. మరి ఈ లేఆఫ్స్‌కు కారణం ఏమిటి? దీనికి సీఈఓ మాథ్యూ ప్రిన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో స్పష్టతనిచ్చారు.

‘అమెరికా వ్యాపార చరిత్రలోనే 30 శాతానికి పైగా వృద్ధి చెందుతున్న ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగుల్లో 20 శాతం కంటే ఎక్కువ మందిని తొలగించిన దాఖలాలు లేవు. ఇది ఆర్థిక పనితీరు వల్ల జరిగింది కాదు.. ఏఐ వల్ల కంపెనీ నిర్వహణ శైలిలో వస్తున్న మార్పుల వల్ల జరిగింది’ అన్నారు.

టార్గెట్ మిడిల్ మేనేజ్‌మెంట్

చాలామంది ఎగ్జిక్యూటివ్‌లు ఏఐ మొదట ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే విషయంలో తప్పుడు అంచనాలతో ఉన్నారని ప్రిన్స్ అభిప్రాయపడ్డారు. ‘ఏఐ ప్రాథమికంగా బిల్డర్లు (ఉత్పత్తులను తయారు చేసేవారు) లేదా సెల్లర్లు (విక్రయించేవారు) జోలికి వెళ్లడం లేదు. దానికి బదులు వ్యాపార పనితీరును అంచనా వేసే, పర్యవేక్షించే, నివేదికలు ఇచ్చే మెజర్‌మెంట్ (కొలత/పర్యవేక్షణ) పాత్రలను తుడిచిపెట్టేస్తోంది’ అన్నారు.

ఏఐ పర్యవేక్షణ ఎందుకు సమర్థవంతమైనది?

గతంలో కంపెనీలు తమ వ్యాపార నష్టాలను, పురోగతిని ప్రతి త్రైమాసికానికి ఒకసారి మాన్యువల్‌గా సమీక్షించేవి. కానీ ఇప్పుడు ఏఐ సాధనాలు నిరంతరాయంగా కార్యకలాపాలను ఆడిట్ చేయగలవు. గతంలో మానవ మేధస్సుకు కష్టతరమైన సామర్థ్యాలను ఏఐ క్షణాల్లో పూర్తి చేస్తోంది. ఏఐ పుణ్యమా అని పెద్ద టీమ్‌లను పర్యవేక్షించడం మేనేజర్లకు సులువైంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్‌మెంట్ అవసరం లేకుండా పోయింది. ‘గత వారం మేము తొలగించిన వారిలో ఎక్కువ మంది ఇలాంటి ‘మెజర్‌మెంట్‌’ పాత్రల్లో ఉన్నవారే’ అని ప్రిన్స్ స్పష్టం చేశారు.

ఏఐ యుగంలో మనుగడ సాగించేవి ఇవే..

మాథ్యూ ప్రిన్స్ విశ్లేషణ ప్రకారం.. ఏఐ ఎంత వేగంగా విస్తరించినప్పటికీ మార్కెట్‌లో స్థిరంగా నిలబడేవి, భవిష్యత్తులో కంపెనీలకు అత్యంత అవసరమయ్యేవి కేవలం రెండు పాత్రలు మాత్రమే.

బిల్డర్లు: కొత్త ఉత్పత్తులు, సేవలు, సాంకేతికతలను సృష్టించేవారు (ఉదాహరణకు: డెవలపర్లు, డిజైనర్లు).

సెల్లర్లు: క్లయింట్లతో సంబంధాలను పెంపొందించుకుంటూ కంపెనీ సేవలను మార్కెట్లోకి తీసుకెళ్లి విక్రయించేవారు.

కంపెనీ వ్యూహాలకు అద్దం పడుతూ.. క్లౌడ్ ఫ్లేర్ ఈ వేసవిలో 1,111 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా ఏకంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపికైన యువ ప్రతిభావంతులను ప్రిన్స్ ఏఐ-నేటివ్స్‌గా అభివర్ణించారు. వీరంతా ఉత్పత్తులను నిర్మించడం లేదా విక్రయించడం అనే అంశాలపైనే దృష్టి పెట్టనున్నారు.

టెక్ ప్రపంచంలో మిశ్రమ స్పందనలు

ప్రిన్స్ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చర్చకు దారితీశాయి. కొందరు నెటిజన్లు ఆయన విశ్లేషణను సమర్థిస్తున్నారు. సాంప్రదాయ కార్పొరేట్ నిర్మాణాల్లో ఉండే అనవసరమైన మధ్యస్థాయి బ్యూరోక్రసీని తగ్గించడానికి ఏఐ ఉపయోగపడుతుందని వారు వాదిస్తున్నారు. అయితే, నాణేనికి మరోవైపు ఉన్న ప్రమాదాన్ని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఏఐ ఇచ్చే కొలమానాలు, నంబర్లపైనే అతిగా ఆధారపడితే కంపెనీల్లో కొత్త ప్రయోగాలు, దీర్ఘకాలిక ఆవిష్కరణలు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: స్పేస్‌ ఎక్స్‌ ఐపీఓ.. మనోడి పంట పండింది!

Advertisement
 
Advertisement
Advertisement