స్పేస్‌ ఎక్స్‌ ఐపీఓ.. మనోడి పంట పండింది! | Indian-Origin Investor Behind SpaceX IPO Boom, Antonio Gracias Emerges As Key Architect Of $2 Trillion Space Revolution | Sakshi
Sakshi News home page

స్పేస్‌ ఎక్స్‌ ఐపీఓ.. మనోడి పంట పండింది!

May 22 2026 2:41 PM | Updated on May 22 2026 4:35 PM

Antonio Gracias Silent Billionaire Behind Elon Musk SpaceX ipo

ప్రపంచ అంతరిక్ష రంగ ముఖచిత్రాన్ని మార్చేసిన స్పేస్ ఎక్స్ ఐపీఓ దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, పబ్లిక్ ఇష్యూ తర్వాత ఈ సంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2 ట్రిలియన్‌ డాలర్లు (రూ.165 లక్షల కోట్ల పైమాటే) మైలురాయిని తాకే అవకాశం ఉంది. సాధారణంగా స్పేస్ ఎక్స్ అనగానే ప్రపంచమంతా ఎలాన్ మస్క్ పేరే వినబడుతుంది. కానీ, లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటూ ఆధునిక సాంకేతిక చరిత్రలోనే అతిపెద్ద సంపద సృష్టికి కేంద్ర బిందువుగా మారిన ఒక భారతీయ సంతతి వ్యక్తి కథ ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. ఆయనే ఆంటోనియో గ్రేసియాస్.

ఎవరీ ఆంటోనియో గ్రేసియాస్?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో యాక్టివ్‌గా ఉంటూ సందడి చేయడం గ్రేసియాస్ శైలి కాదు. ఆయన నిశ్శబ్దంగా ఉండే వ్యూహకర్త. స్పేస్‌ ఎక్స్‌ ఐపీఓ ఫైలింగ్స్ వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం.. గ్రేసియాస్, ఆయన పెట్టుబడి సంస్థ ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’ సంయుక్తంగా స్పేస్ ఎక్స్‌లో 7.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ అంచనాల ప్రకారం 2 ట్రిలియన్లకు చేరితే గ్రేసియాస్ వాటా విలువ మాత్రమే 128 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.10.6 లక్షల కోట్లు) అవుతుంది. ఈ సంపద ప్రపంచంలోని ఎన్నో బ్లూ-చిప్ కంపెనీల మార్కెట్ క్యాపిటల్‌ కంటే, పలు చిన్న దేశాల జీడీపీ కంటే ఎక్కువ కావడం గమనార్హం.

ఆ మూలాలు గోవాలోనే..

ఆంటోనియో గ్రేసియాస్ తండ్రి భారతదేశంలోని గోవా నుంచి అమెరికాకు వలస వెళ్లి డెట్రాయిట్‌లో న్యూరో సర్జన్‌గా స్థిరపడ్డారు. తల్లి స్పానిష్ ఫార్మసిస్ట్. అమెరికాలోనే పుట్టి పెరిగిన గ్రేసియాస్ జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్, చికాగో యూనివర్సిటీలో లా చదివారు. జపాన్‌లోని వాసెడా యూనివర్సిటీలోనూ ఉన్నత విద్య అభ్యసించారు. 1995లో లా స్కూల్‌లో ఉన్నప్పుడే ‘ఎంజీ క్యాపిటల్’ను స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో ‘వాలోర్ ఈక్విటీ పార్టనర్స్’గా రూపాంతరం చెందింది.

మస్క్ - గ్రేసియాస్ బంధం

2008 కాలంలో ప్రైవేట్ అంతరిక్ష రంగంపై పెట్టుబడి పెట్టడం అంటే అప్పట్లో అదొక పిచ్చి ప్రయోగం. రాకెట్లు వరుసగా పేలిపోతున్న తరుణంలో నాసా ఒప్పందాలు కూడా భవిష్యత్తుకు గ్యారెంటీ ఇవ్వని రోజుల్లో గ్రేసియాస్ మస్క్‌ను నమ్మి పెట్టుబడి పెట్టారు. టెస్లా, స్పేస్ ఎక్స్, తాజాగా ఎక్స్‌ఏఐ... ఇలా మస్క్ సామ్రాజ్యంలోని ప్రతి కీలక మలుపులోనూ గ్రేసియాస్ భాగస్వామ్యం ఉంది.

ఇటీవలి బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం, మస్క్‌కు చెందిన ఎక్స్‌ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణకు వాలోర్ ఈక్విటీ భారీగా నిధులు సమకూర్చింది. అత్యంత ఖరీదైన ఏఐ చిప్స్, డేటా సెంటర్ పరికరాలను తానే స్వయంగా కొనుగోలు చేసి వాటిని ఎక్స్‌ఏఐ సంస్థకు లీజుకు ఇచ్చే వినూత్న వ్యూహాన్ని గ్రేసియాస్ అమలు చేశారు. ఈ ఆర్థిక ఒప్పందాల ద్వారానే 2025, 2026 ప్రారంభ త్రైమాసికాల నాటికి వందల మిలియన్ల డాలర్ల లీజు చెల్లింపులు వాలోర్ ఖాతాలోకి చేరడం విశేషం.

ఇదీ చదవండి: బంగారం ధరలు కాస్త కూల్‌!

Advertisement
 
Advertisement
Advertisement