
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ 'వైభవ్ తనేజా' సంపాదన 2024లో ఏకంగా 139.5 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ఇటీవలే తెలుసుకున్నాం. ఇప్పుడు విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా 'రిషద్ ప్రేమ్‌జీ', సీఈఓ 'శ్రీనివాస్ పల్లియా' సంపాదనలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
దిగ్గజ ఐటీ కంపనీ విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ.. సంపాదన గత ఆర్ధిక సంవత్సరంలో 1.6 మిలియన్ డాలర్లు (రూ.13.66 కోట్లు). ఇది అంతకుముందు ఆర్ధిక సంవత్సరం కంటే రెట్టింపు. అయితే.. ఈ సంపాదన సీఈఓ శ్రీనివాస్ పల్లియా కంటే చాలా తక్కువ అని స్పష్టమవుతోంది.
నిజానికి 2023-24 ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ ఆశించిన లాభాలను పొందలేదు. దీంతో ఆ సమయంలో రిషద్ ప్రేమ్‌జీ ఎలాంటి కమీషన్ తీసుకోలేదు. అంతే కాకుండా.. తనకు వచ్చే వేతనంలో కూడా 20 శాతం కోతను విధించుకున్నారు. కాబట్టి అప్పుడు ఆయన సంపాదన రూ. 6.4 కోట్లకు పరిమితమైంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 18.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతో ప్రేమ్‌జీ సంపాదన రూ.13.7 కోట్లకు చేరింది.
విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా సంపాదన విషయానికి వస్తే.. ఈయన గత ఆర్ధిక సంవత్సరంలో 6.2 మిలియన్ డాలర్లు (రూ.53.64 కోట్లు) సంపాదించారు. ఈ సంపాదన డెలాపోర్టేలో ఉన్నప్పటికంటే తక్కువే. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో ఈయన డెలాపోర్టేలో రూ.168 కోట్లు సంపాదించారు.
ఇదీ చదవండి: గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓల కంటే ఎక్కువ సంపాదన: ఎవరీ వైభవ్ తనేజా?
శ్రీనివాస్ పల్లియా మొత్తం సంపాదనలో వేతనం 1.7 మిలియన్ డాలర్లు మాత్రమే. అలవెన్సులు రూపేణా 1.7 మిలియన్ డాలర్లు సంపాదించారు. మిగిలిన 2.8 మిలియన్ డాలర్ల సంపాదన ఇతరత్రా ఉన్నాయి. 0.35 శాతం కమీషన్, ఇతర స్టాక్ ఆప్షన్స్ కూడా ఆయన సంపాదనలో మిళితమై ఉన్నాయి.