భారతదేశంలోని అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) అంతర్జాతీయ విస్తరణలో భాగంగా 2026 నాటికి నైజీరియాలో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది పశ్చిమ ఆఫ్రికాలో భారతదేశానికి చెందిన మొదటి ఐఐటీ క్యాంపస్ కానుంది.
నైజీరియాలో ఎందుకు?
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) 2020 అమలులో భాగంగా విదేశాల్లో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈ విస్తరణ ద్వారా భారతదేశం తన అకడమిక్ సామర్థ్యాన్ని ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్యాంపస్ ద్వారా భారత్, నైజీరియా మధ్య విద్యా, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత పెరుగుతుంది.
ఆఫ్రికా ఖండంలో శాస్త్ర, సాంకేతిక విద్యను ప్రోత్సహించడం ద్వారా దీర్ఘకాలిక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవాలని భారత్ భావిస్తోంది.
నైజీరియా ప్రభుత్వం తమ దేశాన్ని ప్రాంతీయ సాంకేతిక కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ స్థాయి విద్యాసంస్థ అయిన ఐఐటీ ఏర్పాటుతో ఈ లక్ష్యం వేగవంతమవుతుందని నైజీరియా విశ్వసిస్తోంది.
నైజీరియా విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన ఇంజినీరింగ్, సాంకేతిక విద్యను అందించడానికి భారత ఐఐటీ ఉపయోగపడుతుంది. ఇది ‘బ్రెయిన్ డ్రెయిన్’(ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లడం) సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
ఈ క్యాంపస్ పనులు ఏ దశలో ఉన్నాయి?
నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రణాళిక దశలో ఉన్నాయి. ఈ క్యాంపస్ సులేజాలోని ఫెడరల్ గవర్నమెంట్ అకాడమీ (FGA)లో ఏర్పాటు కానుంది. ఈ ప్రాంతాన్ని ‘నైజీరియన్ అకాడమీ ఫర్ ది గిఫ్టెడ్’ అని కూడా పిలుస్తారు. ఈ అకాడమీని భారత్ సహకారంతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా మార్చనున్నారు. ఈ క్యాంపస్‌లో అధ్యాపకుల నియామకం, కోర్సుల రూపకల్పనను పర్యవేక్షించడానికి ఇండియా, నైజీరియాకు చెందిన సంయుక్త బృందం పని చేస్తుంది.
🚨 India is opening a IIT campus in Nigeria in 2026. pic.twitter.com/oPocRgVNhJ
— Indian Tech & Infra (@IndianTechGuide) October 29, 2025
2026 నాటికి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థుల మొదటి బ్యాచ్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. క్యాంపస్ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్‌ను నైజీరియా ప్రభుత్వం నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఈ క్యాంపస్‌లో ప్రవేశానికి సంబంధించిన కచ్చితమైన తుది వివరాలు ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే నవంబర్ 2023లో టాంజానియాలో భారత్ ఐఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: వీసా, మాస్టర్ కార్డుకు రూపే గట్టి పోటీ.. కారణాలు..


