భారతదేశం సొంత పేమెంట్ నెట్‌వర్క్ అయిన రూపే (RuPay) దశాబ్ద కాలంలోనే దేశీయ మార్కెట్‌లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. ఈ వ్యవస్థలోని అంతర్జాతీయ దిగ్గజాలైన మాస్టర్ కార్డ్ (Mastercard), వీసా (Visa) కార్డులకు రూపే గట్టి పోటీని ఇస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రభుత్వం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), భారతీయ బ్యాంకుల మద్దతుతో రూపే కార్డులు డెబిట్ కార్డు విభాగంలో గణనీయమైన వాటా సాధిస్తున్నాయి. రూపే ఇలా భారత మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి కారణాలేమిటో చూద్దాం.
జన ధన్ యోజన (PMJDY)
2014లో ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా తెరిచిన కోట్లాది బ్యాంకు ఖాతాలకు రూపే డెబిట్ కార్డులను జారీ చేశారు. బ్యాంకింగ్ సేవలకు దూరంగా ఉన్న అసంఘటిత వర్గాలకు సైతం కార్డులను అందించడం ద్వారా రూపే వినియోగదారుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.
తక్కువ నిర్వహణ ఖర్చు
రూపే అనేది దేశీయ చెల్లింపు నెట్‌వర్క్ కావడం వల్ల లావాదేవీల ప్రాసెసింగ్ అంతా భారతదేశంలోనే జరుగుతుంది. దీనివల్ల విదేశీ నెట్‌వర్క్‌లతో పోలిస్తే బ్యాంకులు చెల్లించాల్సిన నిర్వహణ, లావాదేవీల రుసుములు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బ్యాంకులకు ఆర్థికంగా లాభదాయకం.
ప్రాసెసింగ్, భద్రత
లావాదేవీలు దేశీయంగా ప్రాసెస్ అవ్వడంతో వీసా లేదా మాస్టర్ కార్డ్ నెట్‌వర్క్‌ల ద్వారా జరిగే లావాదేవీల కంటే రూపే లావాదేవీలు వేగంగా పూర్తవుతాయి. రూపే లావాదేవీలకు సంబంధించిన కస్టమర్ డేటా, లావాదేవీల వివరాలు భారతదేశంలోనే నిల్వ చేస్తారు. ఈ డేటా లోకలైజేషన్ విధానం వల్ల రూపే మరింత సురక్షితమైనదని భావిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహకాలు
రూపే డెబిట్ కార్డులు తక్కువ విలువ గల భీమ్-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రోత్సాహక పథకాలను అమలు చేస్తోంది. ఇది బ్యాంకులు, వ్యాపారులు రూపే వినియోగాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.
రూపే ప్రత్యేకంగా అందిస్తున్న సేవలు
రూపే ఇటీవల ప్రవేశపెట్టిన అత్యంత ముఖ్యమైన సేవల్లో యూపీఐ లింక్ చేసుకునే వీలుండే క్రెడిట్ కార్డులు ఒకటి.
రూపే క్రెడిట్ కార్డులను నేరుగా యూపీఐ యాప్‌లతో లింక్ చేసి స్కాన్ చేసి చెల్లింపు చేసుకోవచ్చు. ఇది క్రెడిట్ కార్డు వినియోగాన్ని విప్లవాత్మకంగా మారుస్తుంది. ఎందుకంటే వీసా/ మాస్టర్ కార్డ్‌లకు ఈ సదుపాయం ఇంకా అందుబాటులో లేదు.
రూపే ప్లాటినం, సెలెక్ట్ వంటి ప్రీమియం కార్డులు దేశీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్‌ను అందిస్తాయి. ఇది దేశంలో తరచుగా ప్రయాణించే వారికి ఒక అదనపు ప్రయోజనం.
కొన్ని రూపే కార్డులు పెట్రోల్ పంపుల్లో ఇంధనం కొనుగోలుపై సర్‌ఛార్జ్ మినహాయింపులను అందిస్తున్నాయి.
రూపే ఏటీఎం, POS (పాయింట్ ఆఫ్ సేల్) లావాదేవీల కోసం ప్రత్యేక భద్రతా ప్రమాణాలను, రూపే పేసెక్యూర్(RuPay PaySecure) అనే ఈ-కామర్స్ పరిష్కారాన్ని కలిగి ఉంది. ఇది దేశీయ ఆన్‌లైన్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది.
ఇదీ చదవండి: మొదటి స్వదేశీ డ్రైవర్‌లెస్ కారు ఆవిష్కరణ!


