
భారతదేశం ముడి చమురు దిగుమతిని ప్రభావితం చేసేలా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (APSEZ) చర్యలు చేపట్టింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్‌గా ఉన్న ఏపీసెజ్ యూఎస్, యూరోపియన్ యూనియన్, యునైటెడ్ కింగ్‌డమ్ ద్వారా ఆంక్షల్లో ఉండి రాకపోకలు సాగిస్తున్న నౌకలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. దేశంలో అదానీ ఆపరేట్ చేస్తున్న అన్ని ఓడరేవుల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
భారతదేశ ఇంధన పోర్ట్‌ఫోలియోలో కీలకంగా ఉన్న రష్యన్ ముడి చమురు ప్రవాహంపై ఈ చర్యలు ప్రభావితం చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదానీ కొత్త ఆదేశాల ప్రకారం.. పాశ్చాత్య ప్రభుత్వాల ఆంక్షలకు గురైన నౌకలకు ఏపీసెజ్ టెర్మినల్స్ ప్రవేశం, బెర్తింగ్, పోర్ట్ సర్వీసులను పూర్తిగా నిషేధించింది. అందుకు అనుగుణంగా షిప్పింగ్ ఆపరేటర్లు నామినేట్ చేసిన నౌక ఆంక్షల పరిధిలో లేదని నిర్ధారిస్తూ రాతపూర్వక హామీ సమర్పించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ పరిశీలన పెరగడం, షాడో ఫ్లీట్(నిబంధనలకు విరుద్ధంగా విదేశీ చమురు సరఫరా) అధికమవుతుండడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రపంచ మార్కెట్లలో చమురు సరఫరాలు, వస్తువుల ఎగుమతులు, దిగుమతులపై స్క్రూటినీ పెరుగుతున్న నేపథ్యంలో అదానీ గ్రూప్ ఈమేరకు చర్యలు చేపట్టినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ చర్యల వల్ల రష్యా చమురుపై సరఫరా పరంగా ఒత్తిడి పెరుగుతుందనే వాదనలున్నాయి.
ఏపీసెజ్ ఫ్లాగ్‌షిప్ టెర్మినల్స్‌లో ఒకటైన ముంద్రా పోర్ట్ భారతదేశం మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 10% నిర్వహిస్తుంది. రష్యన్ చమురు సరఫరాకు కీలక కేంద్రంగా ఉంది.
హెచ్‌పీసీఎల్-మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్ (హెచ్ ఈఎంఎల్) తన ముడి చమురు దిగుమతుల్లో 100 శాతం ముంద్రా ద్వారానే కొనసాగిస్తోంది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా బహుళ శుద్ధి కార్యకలాపాల కోసం ముంద్రాను విస్తృతంగా ఉపయోగిస్తుంది.
పోర్ట్ ట్రాఫిక్ డేటా ప్రకారం, ఇటీవలి నెలల్లో ముంద్రాకు 50% రష్యన్ ముడి చమురు బ్యారెళ్లు సరఫరా అవుతున్నాయి.
కాండ్లా, ముంబై, పారాదీప్ వంటి ప్రభుత్వ ఓడరేవులకు సరఫరా పెరిగే అవకాశం ఉన్నట్లు కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: వంతారాపై సుప్రీంకోర్టు విచారణ.. సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పణ