
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం వంతారాలో చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేశారనే ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ప్రసన్న బి.వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ రిపోర్ట్‌ను రికార్డ్ చేసింది.
దర్యాప్తులో భాగంగా సిట్ బృందం వంతారాలో మూడు రోజులు గడిపింది. విచారణలో భాగంగా బృందానికి సహకరించడానికి అనేక రాష్ట్ర అటవీ శాఖల సీనియర్ అధికారులతో సహా అనేక ఇతర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇన్వెస్ట్‌గేషన్ సందర్భంగా వంతరా సీనియర్ సభ్యులను సుదీర్ఘంగా ప్రశ్నలు అడిగి ధ్రువపత్రాలు సేకరించింది.
పిటిషనర్ ఆరోపణలు..
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలోని సిట్.. పిటిషనర్ సీఆర్ జయ సుకిన్ లేవనెత్తిన ఆరోపణలపై నిజనిర్ధారణ విచారణ జరిపింది. వన్యప్రాణుల రెస్క్యూ, పునరావాస సదుపాయాన్ని నిర్వహించే ముసుగులో ఏనుగులు, పక్షులు, అంతరించిపోతున్న జాతులతో సహా చట్టవిరుద్ధంగా జంతువులను కొనుగోలు చేసిందని పిటిషన్‌లో ఆరోపించారు. వన్యప్రాణుల రక్షణ చట్టాలు, అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలు, జంతు సంక్షేమ ప్రమాణాలకు వ్యతిరేకంగా జంతువులను కేంద్రంలోకి తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు.
వంతారా స్పందన
ఈ వ్యవహారంపై వంతారా స్పందిస్తూ చట్టపరంగా మూగజీవులను కాపాడేందుకు పక్కాగా చర్యలు పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ‘సుప్రీంకోర్టు ఉత్తర్వులను గౌరవిస్తున్నాం. పారదర్శకతతో చట్టాన్ని పూర్తిగా పాటించడానికి వంతారా కట్టుబడి ఉంది’ అని వంతారా అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 25, 2025న సిట్‌ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు, సెప్టెంబర్ 12 లోగా తన ఫలితాలను సమర్పించాలని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా సిట్ తన నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది.
వంతారా
అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: జీఎస్‌టీ కోతతో ఇళ్లకు డిమాండ్