క్యాపిటల్‌ అసెట్‌ అంటే?

What Is A Capital Asset? How It Works, With Example In Telugu - Sakshi

గత పది వారాలుగా స్థిరాస్తి కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కావాల్సిన కాగితాలు, సోర్స్‌ ఎలా వివరించాలో తెలుసుకున్నాం. ఆ తర్వాత స్థిరాస్తి మీద వచ్చే ఆదాయం, అంటే అద్దె, పన్ను భారానికి ఎలా గురి అవుతుందో, వచ్చే మినహాయింపులు.. పన్ను భారం.. టీడీఎస్‌ బాధ్యతలు మొదలైనవి ఏమిటో తెలుసుకున్నాం. ఈ వారం నుంచి స్థిరాస్తి అమ్మకంలో ఏర్పడే లాభనష్టాలకు సంబంధించిన అన్ని విషయాలను క్షుణ్నంగా తెలుసుకుందాం. 

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 2 (14)లో ‘క్యాపిటల్‌ అసెట్‌’ అనే దాన్ని నిర్వచించారు. దీని ప్రకారం.. 

♦ అసెసీకి ఉన్న ఆస్తి 

♦ ఈ ఆస్తి వ్యక్తిగతమైనదైనా, వ్యాపార–వృత్తిపరమైనదైనా ఎటువంటి తేడా లేదు 

♦ స్థిరాస్తి అయినా.. చరాస్తి అయినా.. 

♦కంటికి కనిపించేది అయినా.. కనిపించనిది అయినా.. 

♦ఆస్తి ద్వారా సంక్రమించిన హక్కులు, నిర్వహణ ప్రయోజనం పొందే హక్కులు అయితే, ఏది క్యాపిటల్‌ అసెట్‌ కాదో.. అంటే వేటిని క్యాపిటల్‌ అసెట్‌గా పరిగణించరో, వాటి జాబితా కూడా ఉంది. ఈ కింద అసెట్లను క్యాపిటల్‌ అసెట్‌గా పరిగణించరు. 

♦వ్యాపారంలో అమ్ముకోవడానికి కొనుక్కున్న వస్తువులు. మీరు ఏ వస్తువులను కొని, వాటిని వ్యాపారంలో భాగంగా అమ్ముతారో వాటిని క్యాపిటల్‌ అసెట్‌గా పరిగణించరు. ఉదాహరణకు బంగారాన్ని ఆస్తిగా పరిగణిస్తాం కానీ.. బంగారం అమ్మే వ్యక్తికి మాత్రం అది క్యాపిటల్‌ అసెట్‌ కాదు. ఈ మినహాయింపులో మన మీద ఎటువంటి ప్రేమ, కనికరం ఉండదు. వ్యాపారంలో లాభనష్టాలను వేరే శీర్షిక కింద విభజించి, అసెస్‌ చేస్తారు. 

♦వ్యక్తిగత అవసరాలకు వాడుకునే బట్టలు, ఫర్నిచర్, కార్లు, టూ వీలర్లు, టీవీలు, ఫ్రిజ్, గన్ను, జనరేటర్లు, సంగీత పరికరాలు మొదలైనవి మినహాయింపు ఇస్తారు. కానీ బంగారం, జ్యుయలరీ, ఆభరణాలు, విలువైన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, పురాతన వస్తువులు, శిల్ప సంపద వీటిని మాత్రం క్యాపిటల్‌ అసెట్‌గా పరిగణిస్తారు.  

♦ వ్యవసాయ భూములు (షరతులకు లోబడి) 

♦బాండ్లు.. గిల్ట్‌ బాండ్లు, స్పెషల్‌ బేరర్‌ బాండ్లు, గోల్డ్‌ స్కీముకి సంబంధించిన బాండ్లు.

♦కానీ వ్యవసాయ భూముల విషయంలో కొన్ని షరతుల వర్తిస్తాయి. మొదటిది జనాభా ప్రాతిపదిక కాగా, రెండోది ఆ ఊరి లోకల్‌ లిమిట్‌ (పాత కాలంలో పొలిమేర) నుంచి కిలోమీటర్ల లెక్కన ఉంటుంది. జనాభా లెక్కల ప్రకారం.. కొలతల ప్రకారం నిర్ధారించాలి. 

♦మీకున్న వ్యవసాయ భూమి, జనాభాని బట్టి పైన చెప్పిన కిలోమీటర్లు దాటిన తర్వాత ఉన్న భూమి.. అదీ సాగులో ఉండాలి. అటువంటి దాన్ని వ్యవసాయ భూమి అంటారు. నగరం నడిరోడ్డున మీరు సాగు చేసి వరి పండించినా ఆ భూమిని వ్యవసాయ భూమిగా పరిగణించరు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top