
ఇన్‌ఫ్రా, డెవలపర్ టూల్స్ సంస్థలపై కన్ను
పెట్టుబడులకు వెస్ట్‌బ్రిడ్జ్, ఎలివేషన్, లైట్‌స్పీడ్ సై
జనవరి–జూలైలో రూ. 4,600 కోట్ల సమీకరణ
దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రవేశించే ప్రాథమికస్థాయి కంపెనీలకు వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు పెట్టుబడులు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఏఐ అభివృద్ధి వ్యవస్థ (ఎకోసిస్టమ్)లో ఇటీవల పలు కొత్తతరహా స్టార్టప్‌లు ఊపిరి పోసుకుంటున్న నేపథ్యంలో వీసీ నిధులకు ప్రాధాన్యత ఏర్పడింది. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్
ప్రధానంగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డెవలపర్ టూల్స్ విభాగాలలోని దేశీ కంపెనీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీసీ సంస్థలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, ఎలివేషన్ క్యాపిటల్, యాక్సెల్, లైట్‌స్పీడ్, ప్రోజస్, నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ తదితరాలు చేరాయి. దీంతో ఏఐలో మౌలిక, డెవలపర్ విభాగాలపై దృష్టిపెట్టిన కంపెనీలు ఎంటర్‌ప్రైజ్‌లుగా అభివృద్ధి చెందేందుకు వీసీ నిధులు తోడ్పాటునివ్వనున్నాయి. వెరసి ఎజెంటిక్ ప్లాట్‌ఫామ్స్‌కు జోష్ లభించనుంది. తద్వారా స్వతంత్ర ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి వీలు చిక్కనుంది.
అంటే వివిధ టాస్‌్కలను స్వతంత్రంగా నిర్వహించగల సామర్థ్యమున్న సాఫ్ట్‌వేర్ ఆధారిత టూల్స్ ఊపిరిపోసుకోనున్నాయి. ఇవి సంబంధిత ఆర్గనైజేషన్లలో క్లిష్టతరహా పనులను చక్కబెట్టడంతోపాటు.. విభిన్న వ్యవస్థలతో సమీకృతంకాగలవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వీటికి ప్రత్యేకించిన సర్విసులను పూర్తి చేయడంపై ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టిపెడతాయని తెలియజేశాయి. ఒకే టాస్‌్కకు పరిమితమయ్యే సంప్రదాయ ఏఐ టూల్స్‌తో పోలిస్తే వీటి పరిధి విస్తారంగా ఉంటుందని వివరించాయి. పలు కార్యకలాపాలను ఆటోమేషన్‌తో అనుసంధానించవచ్చని తెలియజేశాయి.
కొత్త తరహా టూల్స్
ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్, డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ (డెవ్‌ఆప్స్) ఆటోమేషన్, భారీస్థాయి ఎడాప్షన్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టిపెట్టిన స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫలితంగా ఆయా స్టార్టప్‌లలో పెట్టుబడులకు వీసీ సంస్థలు ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆధునిక, సరికొత్త మోడళ్లు ఊపిరిపోసుకున్న ప్రతిసారీ ప్లాట్‌ఫామ్స్ మారిపోతుంటాయని ఎలివేషన్ క్యాపిటల్ ఏఐ పార్ట్‌నర్ కృష్ణ మెహ్రా తెలియజేశారు.
దీంతో పూర్తిస్థాయిలో సరికొత్త అవకాశాలకు తెరలేస్తుంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భాలు(సైకిల్స్) ఆయా స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు అవకాశాలను కల్పిస్తాయని, తద్వారా ప్రపంచస్థాయిలో పోటీపడగల సంస్థలుగా తీర్చిదిద్దేందుకు వీలు చిక్కుతుందని వివరించారు. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025) జనవరి నుంచి జూలైవరకూ దేశీ జెన్‌ఏఐ స్టార్టప్‌లు 52.4 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,600 కోట్లు) అందుకున్నట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
పెట్టుబడుల తీరిదీ..
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎలివేషన్ క్యాపిటల్ గత రెండేళ్లలో 15–20 ఏఐ పెట్టుబడులను చేపట్టడం గమనార్హం! ఇక ఎంటర్‌ప్రైజెస్‌లు కనెక్ట్ అయ్యేందుకు, తమ సాఫ్ట్‌వేర్ టూల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు సహకరించే యూనిఫై యాప్స్ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 2–2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 200 కోట్లు) సమీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2023లో ఏర్పాటైన ఈ సంస్థలో ఎలివేషన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. అప్లికేషన్ల బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్ చేపట్టే ఎమర్జెంట్ ఏఐ.. లైట్‌స్పీడ్ వెంచర్ తదితర సంస్థల నుంచి 2 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది.
కేవలం రెండు నెలల్లోనే ఈ సంస్థ కోటి డాలర్ల(రూ.87 కోట్లు) వార్షిక రికరింగ్ టర్నోవర్ సాధించడం విశేషం! ఈ బాటలో లైట్‌స్పీడ్ తదితర సంస్థల నుంచి ఎజెంటిక్ స్టార్టప్.. కంపోజియో 2.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఎంటర్‌ప్రైజ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఆటోమేట్ చేసే రీఫోల్డ్ ఏఐ.. ఎనియాక్ వెంచర్స్, టైడల్ వెంచర్స్ తదితరాల నుంచి 6.5 మిలియన్ డాలర్లు(రూ.56 కోట్లు) సీడ్‌ఫండ్‌గా అందుకుంది. ప్రోజస్,యాక్సెల్, ఎక్సీడ్ వెంచర్స్ నుంచి సాఫ్ట్‌వేర్ ప్రొడక్టివిటీ ప్లాట్‌ఫామ్.. కోడ్‌కర్మ 2.5 మి. డాలర్లు(రూ.21 కోట్లు) పొందింది.