
భారత ఎగుమతులపై అమెరికా విధించిన అధిక టారిఫ్‌లు దేశీయ మార్కెట్లో అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలను ప్రభావితం చేయొచ్చని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. అధిక టారిఫ్‌లు చిన్న వ్యాపారాలకు విఘాతం కలిగించొచ్చంటూ.. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే రూ.45 లక్షల్లోపు ధరల ఇళ్ల కొనుగోలుదారుల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తు చేసింది.
‘యూఎస్‌కు వస్తు ఎగుమతుల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈలు) అధిక వాటా కలిగి ఉన్నాయి. అధిక టారిఫ్‌లతో వీటి ఉత్పత్తులకు ఉన్న పోటీ తగ్గిపోతుంది. దీంతో వాటికి ఆర్డర్లు తగ్గుతాయి. ఆయా సంస్థల ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’అని అనరాక్ వివరించింది. అందుబాటు ధరల ఇళ్ల అమ్మకాలు, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం అన్నవి కనిష్ట స్థాయికి పడిపోయినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 2025 మొదటి ఆరు నెలల్లో 1.9 లక్షల యూనిట్ల ఇళ్లు అమ్ముడవగా.. ఇందులో అందుబాటు ధరల విభాగంలో విక్రయాలు 34,565 యూనిట్లుగానే ఉన్నట్టు పేర్కొంది.
కోలుకోవడానికి ఇబ్బందులు..
‘రూ.45 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరల్లోని ఇళ్లు ఈ విభాగం కిందకు వస్తాయి. ఈ విభాగంపై కరోనా విపత్తు పెద్ద ప్రభావాన్నే చూపించింది. కోలుకునేందుకు ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ విభాగం పట్ల ఉన్న కొద్దో గొప్ప ఆశలను ట్రంప్ అధిక టారిఫ్‌లు ఆవిరి చేస్తున్నాయి’ అని అనరాక్ రీసెర్చ్ ఈడీ ప్రశాంత్ ఠాకూర్ వివరించారు.
ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?
భారత జీడీపీలో ఎంఎస్‌ఎంఈలు 30 శాతం వాటా కలిగి ఉన్నాయన్న ప్రభుత్వ గణాంకాలను అనరాక్ ప్రస్తావించింది. అలాగే ఎగుమతుల్లో 45 శాతం వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. అమెరికా 50 శాతం టారిఫ్‌లతో ఎంఎస్‌ఎంఈలు, వాటి సిబ్బందిపై గణనీయమైన ప్రభావం పడుతుందని అంచనా వేసింది. ఎంఎస్‌ఎంఈలు, ఎస్‌ఎంఈల్లో పనిచేసే సిబ్బంది అందుబాటు ధరల ఇళ్ల విభాగంలో ప్రధాన వినియోగదారులుగా ఉన్నట్టు తెలిపింది. దీంతో ఈ విభాగంలో డిమాండ్‌పై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇది కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణపైనా ప్రభావం చూపిస్తుందని వివరించింది.