టెక్స్‌టైల్స్‌కు కష్టకాలం..! | Trump Tariffs Impact: Textiles and jewellery sectors to bear the brunt | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్స్‌కు కష్టకాలం..!

Aug 29 2025 1:34 AM | Updated on Aug 29 2025 1:34 AM

Trump Tariffs Impact: Textiles and jewellery sectors to bear the brunt

పావు శాతం ఎగుమతులపై ప్రభావం 

వజ్రాలు, టైర్‌ పరిశ్రమకూ ఇబ్బందే..

విధానపరమైన మద్దతుకు డిమాండ్‌

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్‌ల కారణంగా అధిక ప్రభావం పడే టెక్స్‌టైల్స్, వజ్రాల పాలిషింగ్, టైర్ల పరిశ్రమలు ప్రభుత్వం నుంచి విధానపరమైన సాయం కోరుతున్నాయి. ముఖ్యంగా అమెరికా 50 శాతం టారిఫ్‌లు దేశీ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమపై అధిక ప్రభావం చూపించనుంది. మొత్తం టెక్స్‌టైల్స్‌ ఎగుమతుల్లో పావు శాతంపై వచ్చే ఆరు నెలల పాటు టారిఫ్‌ల ప్రభావం ఉంటుందని పరిశ్రమ పేర్కొంది. దేశ వస్త్ర ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. టారిఫ్‌ల కారణంగా ఆర్డర్లు రద్దు అవుతున్నట్టు తెలిపింది.

వచ్చే డిసెంబర్‌ 31 వరకు సుంకాల్లేకుండా కాటన్‌ దిగుమతులకు ప్రభుత్వం అనుమతించడం, దేశీ టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు ఉపశమనం ఇవ్వనున్నట్టు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ టెక్స్‌టైల్స్‌ ఇండస్ట్రీ (సీఐటీఐ) సెక్రటరీ జనరల్‌ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. దీనివల్ల వ్యయాలు తగ్గి కొంత పోటీతత్వం లభిస్తుందన్నారు. ‘వచ్చే 6 నెలలు 20–25% టెక్స్‌టైల్స్‌ ఎగుమతులపై ప్రభావం పడొచ్చు’ అని చెప్పారు. 50% టారిఫ్‌లు టెక్స్‌టైల్స్, వస్త్ర పరిశ్రమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అప్పారెల్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఏఈపీసీ) చైర్మన్‌ సుదీర్‌ శక్రి తెలిపారు. 2024–25లో టెక్స్‌టైల్స్, అప్పారెల్‌ పరిశ్రమ ఆదా యం 179 బిలియన్‌ డాలర్లుగా ఉంటే, ఇందులో ఎగుమతులు 37 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

30 శాతం వ్యాపారంపై ప్రభావం: అమెరికా టారిఫ్‌ల కారణంగా సహజ వజ్రాల పాలిషింగ్‌ పరిశ్రమ 28–30% మేర (12.5 బిలియన్‌ డాలర్లు) ఆదాయం కోల్పోవచ్చని క్రిసిల్‌ రేటింగ్స్‌ వెల్లడించింది. 2024–25లో దేశ సహజ వజ్రాల పాలిషింగ్‌ పరిశ్రమ ఆదాయం 16 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. అమెరికా, చైనాలో డిమాండ్‌ బలహీనపడడం, ల్యాబ్‌లో తయారైన కృత్రిమ వజ్రాల నుంచి పోటీతో గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి దేశీ సహజ వజ్రాల పాలిషింగ్‌ పరిశ్రమ ఆదాయం 40% మేర తగ్గినట్టు క్రిసిల్‌ రేటింగ్స్‌ వివరించింది. పాలిపౌడ వజ్రాల పరిశ్రమకు 80 శాతం ఆదాయం ఎగుమతుల నుంచే వస్తోందని.. భారత ఎగుమతుల్లో 35 శాతం వాటాతో అమెరికా కీలక మార్కెట్‌గా ఉన్నట్టు గుర్తు చేసింది.

టైరు... బేజారు!
భారత టైర్ల పరిశ్రమకు అమెరికా భారీ టారిఫ్‌లు పెద్ద ప్రతికూలమని ఆటోమొబైల్‌ టైర్ల తయారీదారుల సంఘం (ఏటీఎంఏ) పేర్కొంది.  ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు కోసం డిమాండ్‌ చేసింది. అధిక శాతం టైర్ల ఎగుమతులపై 50 శాతం టరిఫ్‌లు అమలు కానుండగా, కొన్నింటికి 25 శాతం టారిఫ్‌ వర్తించనుంది. భారత టైర్ల ఎగుమతుల్లో ఒక్క అమెరికా వాటాయే 17% ఉండడం గమనార్హం. 2024–25లో మొత్తం టైర్ల ఎగుమతుల విలువ రూ.25,000 కోట్లుగా ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement