క్రెడిట్‌ కార్డే దిక్కు! | Think360 ai report reveals striking trend on credit cards youth finance | Sakshi
Sakshi News home page

క్రెడిట్‌ కార్డే దిక్కు!

Jul 16 2025 1:51 PM | Updated on Jul 16 2025 3:14 PM

Think360 ai report reveals striking trend on credit cards youth finance

రూ.50,000లోపు వేతన జీవుల ధోరణి

93 శాతం క్రెడిట్‌ కార్డులపై ఆధారపడిన వారే 

తక్కువ ఆదాయ వర్గాల వారికి క్రెడిట్‌ కార్డులు ఆధారంగా మారుతున్నాయి. రూ.50,000లోపు ఆదాయం ఉన్న వేతన జీవుల్లో 93 శాతం మంది అవసరాల కోసం క్రెడిట్‌ కార్డులపై ఆధారపడుతున్నట్టు థింక్‌ 360.ఏఐ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. స్వయం ఉపాధిపై ఉన్న వారిలో 85 శాతం మంది క్రెడిట్‌ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఉద్యోగం, స్వయం ఉపాధిలో ఉన్న 20,000 మంది వ్యక్తుల ఏడాది కాల ఆర్థిక తీరును అధ్యయనం చేసి థింక్‌ 360 ఈ వివరాలను విడుదల చేసింది.

బై నౌ పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌/ఇప్పుడు కొని తర్వాత చెల్లించే సదుపాయం) సేవలను సైతం వీరు వినియోగిస్తున్నారు. స్వయం ఉపాధిలోని వారిలో 18%, వేతన జీవుల్లో 15% మంది బీఎన్‌పీఎల్‌ను వినియోగిస్తున్నారు. ఒకప్పుడు ఆకాంక్షలుగానే ఉన్న క్రెడిట్‌ కార్డులు, బీఎన్‌పీఎల్‌ సేవలు నేడు నిపుణుల నుంచి తాత్కాలిక ఉద్యోగుల వరకు.. ప్రతి ఒక్కరికీ నిత్యావసరంగా మారాయని థింక్‌360 వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌దాస్‌ తెలిపారు. డిజిటల్‌ రుణాల్లో ఫిన్‌టెక్‌లు పోషిస్తున్న ముఖ్య పాత్రను కూడా ఈ సంస్థ తన నివేదికలో ప్రస్తావించింది.

ఇదీ చదవండి: గగనతలంలో గస్తీకాసే రారాజులు

క్రెడిట్‌ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్‌ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని ఇటీవల పీడబ్ల్యూసీ అంచనా వేసింది. యూపీఐ దెబ్బకు డెబిట్‌ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్‌ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్‌ లేకపోయినా క్రెడిట్‌ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్‌ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్‌ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement