
ప్రతి పదిమందిలో ఒక్కరికే అర్హతలు
ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఏజెంట్ డిజైన్ నైపుణ్యాలకు డిమాండ్
సీనియర్లకు రూ. 60 లక్షల వరకు ప్యాకేజీలు
టీమ్‌లీజ్ డిజిటల్ సర్వే
న్యూఢిల్లీ: దేశీయంగా కృత్రిమ మేథ (ఏఐ) మార్కెట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. కానీ నిపుణల కొరతే పరిశ్రమకు ప్రధాన సమస్యగా మారింది. పది జెన్‌ఏఐ ఉద్యోగాలుంటే నైపుణ్యాలున్న అభ్యర్ధులు ఒక్కరే ఉంటున్నారు. టీమ్‌లీజ్ డిజిటల్ రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం నిర్దిష్ట ప్రాంప్ట్ ఇంజినీరింగ్, ఎల్‌ఎల్‌ఎం సేఫ్టీ..ట్యూనింగ్, ఏఐ ఆర్కె్రస్టేషన్, ఏజెంట్ డిజైన్, సిమ్యులేషన్ గవర్నెన్స్, ఏఐ కాంప్లయెన్స్, రిస్క్ ఆపరేషన్స్‌లాంటి ఏఐ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంటోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు.. జనరేటివ్ ఏఐ ఇంజినీరింగ్, మెషిన్‌లెరి్నంగ్ ఆపరేషన్స్‌లాంటి విభాగాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతున్నాయి. సీనియర్లకు ఏటా రూ. 58–60 లక్షల వరకు ప్యాకేజీలు ఉంటున్నాయి.
నివేదికలోని మరిన్ని విశేషాలు..
→ డిజిటల్ ఎకానమీలో ఏఐ, క్లౌడ్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా ఉంది. దానికి తగ్గట్లుగా నైపుణ్యాలున్న అభ్యర్ధులు లభించక, తీవ్ర కొరత నెలకొంది. దీంతో తగిన అర్హతలున్న వారికి కంపెనీలు భారీ వేతనాలిస్తున్నాయి.
→ జీసీసీల్లో సైబర్‌సెక్యూరిటీ, డేటా ఇంజినీరింగ్ ఉద్యోగుల వేతనాలు 2025–2027 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో వార్షికంగా వరుసగా రూ. 28 లక్షల నుంచి రూ. 33.5 లక్షలకు, రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షలకు పెరగనున్నాయి.
→ నాన్–టెక్ రంగాల్లోని టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఐటీ సపోర్ట్, సంప్రదాయ తరహా సిస్టమ్స్ మెయింటెనెన్స్ విభాగాల్లో వేతనాలు వార్షికంగా రూ. 12 లక్షల స్థాయిలోనే స్థిరపడిపోయి ఉన్నాయి. పరిశ్రమ క్లౌడ్ నేటివ్, ఔట్‌సోర్స్‌డ్ సరీ్వస్ మోడల్స్ వైపు మళ్లుతుండటాన్ని ఇది సూచిస్తోంది.
→ ఏఐ మార్కెట్ ప్రస్తుతం హైపర్–గ్రోత్ దశలోకి అడుగుపెడుతోంది. ఏటా 45 శాతం వృద్ధితో 2025లో 28.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే, ప్రతిభావంతుల కొరత తీవ్రంగా ఉంటోంది. ప్రతి పది జెన్‌ఏఐ ఉద్యోగాలకు అన్ని అర్హతలు కలిగిన ఇంజినీరు ఒకే ఒక్కరు ఉంటున్నారు.
→ 2026 నాటికి ఏఐ టాలెంట్ అంతరాలు 53 శాతానికి పెరగనుంది. అలాగే క్లౌడ్ కంప్యూటింగ్‌లో డిమాండ్–సరఫరా మధ్య అంతరం 55–60 శాతానికి పెరగనుంది.
→ ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో పెద్ద స్థాయిలో శిక్షణను కల్పించకుంటే, కంపెనీల వృద్ధి ఆకాంక్షలు నెరవేరని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
→ ఏఐ వినియోగమనేది జాబ్ మార్కెట్ల రూపురేఖలను గణనీయంగా మార్చేయనుంది. గ్లోబల్ విధులు నిర్వహించే 40 శాతం వరకు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఐటీ సరీ్వసులు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్‌లాంటి రంగాల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే కంపెనీలు ఏఐ–ఫస్ట్ లెర్నింగ్ మోడల్స్, డిజిటల్ అక్షరాస్యతను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి.
→ భారత డిజిటల్ ఎకానమీలో ఉద్యోగాలు, నైపుణ్యాల్లో మార్పులకు ఇంజిన్లుగా వ్యవహరిస్తున్న జీసీసీలు, ఉద్యోగాల కల్పనకు సారథ్యం వహిస్తున్నాయి. 2025లో 22–25 శాతం మేర ఉద్యోగాలు కల్పించనున్నాయి. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అత్యధికంగా కొలువులు ఉండనున్నాయి.
→ 2027లో అందుబాటులోకి రాబోయే 47 లక్షల కొత్త టెక్ ఉద్యోగాల్లో గణనీయ సంఖ్యలో కొలువులను (12 లక్షలు) జీసీసీలే కల్పించనున్నాయి. ప్రధానంగా జెన్‌ఏఐ, ఇంజినీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి.
→ జీసీసీలు మెట్రో పరిధిని దాటి విస్తరిస్తున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో 1,30,000–1,40,000 మంది తాజా గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నాయి. వీరిలో ఎక్కువ శాతం హైరింగ్ ద్వితీయ, తృతీయ శ్రేణి ఇంజినీరింగ్ క్యాంపస్‌లలో ఉండొచ్చు. వైవిధ్యానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇప్పుడు టాప్ 20 జీసీసీల్లో 40 శాతం మంది సిబ్బంది మహిళలే ఉంటున్నారు. పరిశ్రమ సగటు కన్నా ఇది 1.5 రెట్లు అధికం.
→ 2027 నాటికి భారత్‌లో 2,100 పైగా జీసీసీలు ఉంటాయి. వీటిలో 30 లక్షల మంది పైగా ఉంటారు.