
ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులు
సెన్సెక్స్ 368 పాయింట్ల పతనం
ముంబై: అధిక వెయిటేజీ షేర్లలో అమ్మకాలతో దేశీయ స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం మేర నష్టపోయాయి. భారత్, అమెరికాల జూలై రిటైల్ ద్రవ్యోల్బణ డేటా వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 368 పాయింట్లు నష్టపోయి 80,235 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98 పాయింట్లు పతనమై 24,487 వద్ద నిలిచింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనయ్యాయి.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 833 పాయింట్ల పరిధిలో 80,164 వద్ద కనిష్టాన్ని, 80,998 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 24,465 – 24,702 శ్రేణిలో ట్రేడైంది. చైనాతో వాణిజ్య ఒప్పందానికి అమెరికా మరో 90 రోజుల విరామం, యూఎస్ జూలై ద్రవ్యోల్బణ ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.
⇒ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు లిస్టింగ్ రోజే అప్పర్ సర్క్యూట్ తాకింది. ఇష్యూ ధర (రూ.70)తో పోలిస్తే బీఎస్‌ఈలో 67% ప్రీమియంతో రూ.117 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 75% ఎగసి రూ.123 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకి., అక్కడే ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.881 కోట్లుగా నమోదైంది.