
ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్
మళ్లీ 25,000 స్థాయిపైకి నిఫ్టీ
సెన్సెక్స్ 213 పాయింట్లు ప్లస్
ముంబై: ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు డిమాండ్ లభించడంతో స్టాక్ సూచీలు ఐదో రోజూ లాభపడ్డాయి. సెన్సెక్స్ 213 పాయింట్లు పెరిగి 81,858 వద్ద నిలిచింది. నిఫ్టీ 70 పాయింట్లు బలపడి 25,051 వద్ద స్థిరపడింది. ఉదయం ఫ్లాటుగా మొదలైన సూచీలు రోజంతా పరిమిత శ్రేణిలో లాభాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 341 పాయింట్లు పెరిగి 81,985 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 25,089 వద్ద ఇంట్రాడే గరిష్టాలు అందుకున్నాయి.
⇒ రంగాల వారీగా బీఎస్‌ఈ ఇండెక్సుల్లో ఐటీ 3%, టెక్ 2.22%, ఎఫ్‌ఎంసీజీ 1.36%, రియల్టి, టెలికమ్యూనికేషన్ 0.68% రాణించాయి. మిడ్, స్మా ల్ క్యాప్ సూచీలు 0.39%, 0.30% పెరిగాయి. బ్యాంకులు, చమురు, ఫైనాన్స్ సర్విసెస్, ఇంధన షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యాయి.
⇒ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీల షేర్లు డీలాపడ్డాయి. రియల్ మనీ గేమింగ్ వ్యాపారంతో ప్రత్యక్ష సంబంధం లేదంటూ కంపెనీ వివరణ ఇచ్చినప్పట్టకీ.., నజరా టెక్నాలజీస్ షేరు 13% పతనమై రూ.1,222 వద్ద స్థిరపడింది. ఆన్‌మొబైల్ గ్లోబల్స్ షేరు 3.53% నష్టపోయి రూ.53.27 వద్ద నిలిచింది.
⇒ రీగల్ రిసోర్సెస్ షేరు లిస్టింగ్ రోజే భారీ లాభాలు పంచింది. బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.102)తో పోలిస్తే 39% ప్రీమియంతో రూ.142 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో 43% ఎగసి రూ.146 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 29% లాభంతో రూ.132 వద్ద ముగిసింది. కంపెనీ మార్కె ట్ విలువ రూ.1,352 కోట్లుగా నమోదైంది.