
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. ఉదయం ఊగిసలాట దొరణితో ప్రారంభమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి వెళ్లాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్ సూచీలపై పడింది. దీంతో మద్యాహ్నం నుంచి క్రమ క్రమంగా మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. చివరకు సెన్సెక్స్ 123.53 పాయింట్లు (0.23%) క్షీణించి 52852.27 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 31.50 పాయింట్లు (0.20%) క్షీణించి 15824.50 వద్ద ముగిసింది. నేడు రూపాయితో డాలరు మారకం విలువ రూ.74.43 వద్ద నిలిచింది.
నేటి మార్కెట్లో బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటన్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్స్యూరెన్స్, సన్‌ఫార్మా, టాటా స్టీల్, హిందాల్కో, దివిస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు లాభాల్లో ముగిస్తే.. రిలయన్స్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. నేడు బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్ గా ముగియగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం తక్కువగా ముగిసింది.