ఆర్థికమాంద్యం హెచ్చరికలు జారీ అయినా తగ్గని భారతీయ యువత.. ‘సిప్‌’.. సిప్‌.. హుర్రే!

Stock Market Investment Indian Youth Prefer SIP Here The Reasons - Sakshi

సిప్‌ విధానంలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులకు మొగ్గు 

రూ. 6,73,774.80 కోట్లకు చేరిన పొదుపు మొత్తం 

పది నెలల కాలంలో కొత్తగా 82 లక్షల ఖాతాలు ప్రారంభం 

జనవరి నాటికి 6.21 కోట్లకు చేరిన సిప్‌ ఖాతాల సంఖ్య 

భారీగా పెరుగుతున్న సగటు ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తం 

ఆంఫీ తాజా గణాంకాల్లో వెల్లడి 

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతున్నా... మరోసారి ఆర్థికమాంద్యం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నా.. దేశంలోని యువత స్టాక్‌ మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేయడానికే మొగ్గు చూపుతోంది. ఇందుకోసం వారు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విధా­నం (సిప్‌)ను ఎంచుకుంటున్నారు. ప్రతీ నెలా నిర్ధిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్‌ చేయడాన్ని సిప్‌ విధానంగా పేర్కొంటారు.

బ్యాంకు వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, రియల్‌ ఎస్టేట్, బంగారం ధరలు ఆకాశాన్నంటడంతో యువత ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకుంటున్నారు. దీంతో గడిచిన మూడేళ్లలో సిప్‌ ఖాతాల సంఖ్య రెట్టింపు కావడమే కాకుండా అదే స్థాయిలో నెలవారీ ఇన్వెస్ట్‌మెంట్‌ మొత్తం కూడా పెరుగుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పది నెలల కాలంలో సిప్‌ ఖాతాల సంఖ్య 82 లక్షలకు పైగా పెరిగినట్లు అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఆంఫీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 2021–22 ఏప్రిల్‌లో 5.39 కోట్లుగా ఉన్న సిప్‌ ఖాతాల సంఖ్య ఈ ఏడాది జనవరి నాటికి 6.21 కోట్లకు చేరాయి. అంటే సగటున ప్రతీ నెలా 10 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారు.  

భారీగా పెరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ 
దేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ ఆస్తుల విలువ జనవరి నాటికి రికార్డు స్థాయిలో రూ. 14,28,43,642 కోట్లకు చేరితే అందులో సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసిన మొత్తం రూ. 6,73,774.80 కోట్లు ఉందంటే మనవాళ్లు సిప్‌ విధానానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు గడిచిన మూడేళ్లుగా సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే మొత్తంలో కూడా భారీ పెరుగుదల నమోదవుతోంది. 2020–21లో సగటున నెలవారీ ఇన్వెస్ట్‌ చేసే మొత్తం రూ. 9,000 కోట్లుగా ఉంటే అది ఇప్పుడు ఏకంగా రూ. 13,856.18 కోట్లకు చేరింది.

దీర్ఘకాలిక లక్ష్యాలతో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి సంఖ్య ఏటా క్రమంగా పెరుగుతోందని ఆంఫీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎన్‌.ఎస్‌ వెంకటేష్‌ పేర్కొన్నారు. ఒక్క జనవరిలోనే కొత్తగా 23 లక్షల కొత్త సిప్‌ ఖాతాలు ప్రారంభం కావడం దేశీయ స్టాక్‌మార్కెట్‌ పాజిటివ్‌ ట్రెండ్‌కు నిదర్శనంగా పేర్కొన్నారు. సిప్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేస్తున్నవారిలో అత్యధికంగా స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రస్తుత గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశ స్టాక్‌ మార్కెట్ల పతనం తక్కువగా ఉండటానికి సిప్‌ పెట్టుబడులు కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top