
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) 18 మంది ఆవిష్కర్తలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా వీరికి ఇన్నోవేటర్ ఐడీ కార్డులను అందించారు. ఇన్నోవేటర్లు అంకుర సంస్థల ద్వారా సమాజంపై చూపిన ప్రభావాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ హాజరయ్యారు.
సృజనాత్మక ఆలోచనల ద్వారా స్టార్టప్‌లను స్థాపించిన 18 మంది గ్రామీణ ఇన్నోవేటర్లను ఎంపిక చేశారు. వారి ఉమ్మడి ప్రయత్నాల ద్వారా మొత్తం రూ.20 కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు టీజీఐసీ తెలిపింది. వారి ప్రయాణంలో టీజీఐసీ కీలక పాత్ర పోషించి, వారి కార్యకలాపాలను విస్తరించడానికి రూ.1.75 కోట్లకు పైగా నిధులు సమకూర్చింది. వీరికి ప్రత్యేక గుర్తింపు కార్డులు అందించింది. దీన్ని సాధారణ గుర్తింపు కార్డుగా కాకుండా, రాష్ట్ర, జాతీయ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వీరికి ప్రాధాన్యత లభిస్తుంది. అంతేకాక ఈ కార్డుల ద్వారా సంభావ్య పెట్టుబడిదారులు, సహకారులు, కస్టమర్లను పెంచుకునే అవకాశం ఉంటుంది. తద్వారా వారు తమ మార్కెట్‌ను విస్తరించుకోవచ్చు.
ఇదీ చదవండి: వేగంగా వాణిజ్య ఒప్పందాలు
ఈ సందర్భంగా టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ మాట్లాడుతూ.. ‘ఇన్నోవేటర్లను ప్రోత్సహించడమే టీజీఐసీ లక్ష్యం. ఈ ఐడీ కార్డులు వారి సామర్థ్యంపై నమ్మకాన్ని, కొత్త అవకాశాలను పెంచుతాయి’ అని చెప్పారు.