క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు | Hyderabad as a Hub of Creativity Minister Sridhar Babu Says in Indiajoy 2025 | Sakshi
Sakshi News home page

క్రియేటివిటీ హబ్‌గా హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు

Nov 1 2025 7:00 PM | Updated on Nov 1 2025 7:42 PM

Hyderabad as a Hub of Creativity Minister Sridhar Babu Says in Indiajoy 2025

హైదరాబాద్ కేవలం ఐటీ రాజధానిగా మాత్రమే కాదు, భారతదేశపు క్రియేటివిటీ హబ్‌గానూ తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ వీఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ (టీవీఏజీఏ) సంయుక్తాధ్వర్యంలో హైటెక్ సిటీలోని హెచ్ఐఐసీలో రెండ్రోజుల పాటు 'ఇండియాజాయ్ 2025' పేరిట నిర్వహించనున్న ఇండియాస్ ప్రీమియర్ మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ కాంగ్రెగేషన్ ను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

సాంకేతికత, సృజనాత్మకత కలిసే చోటుగా హైదరాబాద్ పిక్సెల్, కవిత్వం, అవకాశాల నగరంగా ప్రపంచానికి మార్గ నిర్దేశం చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. క్రియేటివ్ రంగానికి చేయుతనిచ్చేలా క్రియేటివ్ ఫ్యూచర్స్ ఫండ్, ఈస్పోర్ట్స్ అకాడమీ, మహిళా క్రియేటర్ల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సంబంధిత దిగ్గజ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశ గేమింగ్ పరిశ్రమ విలువ 20 శాతం సీఏజీఆర్ తో 2028 నాటికి 6 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.

భారతదేశ మొత్తం వీఎఫ్ఎక్స్ అవుట్‌పుట్‌లో మన వాటా సుమారు 25 శాతం ఉండటం మనకు గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఓటీటీ కంటెంట్ ప్రొడక్షన్ లో 35 శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఇక్కడి ఎకో సిస్టంపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఇమేజ్ టవర్, ఏఐ ఇన్నోవేషన్ హబ్, ఏఐ సిటీ తదితరాల అందుబాటులోకి వస్తే ఈ ఎకో సిస్టం మరింత పటిష్టం అవుతుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఇమేజ్ టవర్ను వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తెస్తామన్నారు.

క్రియేటివిటీలో సానుభూతి, వైవిధ్యం, సస్టైనబులిటీ, భారతీయ గుర్తింపు ప్రతిబింబించేలా చొరవ తీసుకోవాలని యువ క్రియేటర్స్ కు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం నియంత్రించేదిగా కాకుండా "కో క్రియేటర్"గా మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు, యువ కథానాయకుడు తేజ సజ్జా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, టీవీఏజీఏ ప్రెసిడెంట్ రాజీవ్ చిలక, కార్యదర్శి మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement