World Largest Scooter Factory In Tamilnadu, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతి పెద్ద స్కూటర్‌ ప్లాంట్‌.. ఇండియాలో నిర్మాణం.. ఎక్కడంటే

Dec 8 2021 7:40 PM | Updated on Dec 9 2021 8:26 AM

Simple Energy Aims To Build World Largest Scooter Manufacturing Plant - Sakshi

World Largest Scooter Factory In Tamilnadu: ప్రపంచంలోనే అతి పెద్ద స్కూటర్‌ ప్లాంట్‌ ఇండియాలో నిర్మాణం జరుపుకోబోతుంది. ఈ మేరకు స్కూటర్‌ తయారీ కంపెనీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ ఫ్యాక్టరీలో స్కూటర్ల తయారీ ప్రారంభం కానుంది.

ఓలా రాకతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చింది. మరోవైపు పెరుగుతున్న పెట్రోలు ధరలు సైతం ఈవీ స్కూటర్ల వైపు ప్రజలు మళ్లేలా చేశాయి. ఈ తరుణంలో ప్రపంచంలోనే సింగిల్‌ ఛార్జ్‌ తో అత్యధిక దూరం ప్రయాణించే స్కూటర్‌గా సింపుల్‌ వన్‌ మార్కెట్‌లోకి ఎంటరయ్యింది. ఈ కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం స్టాండర్డ్‌ కండీషన్స్‌లో సింపుల్‌ వన్‌ 236 కిలోమీటర​‍్ల దూరం ప్రయాణం చేస్తుంది. 

అద్భుతమైన ఫీచర్లు ఉండటానికి తోడో ఈవీ స్కూటర్‌బూమ్‌ని అందిపుచ్చుకోవాలని సింపుల్‌ వన్‌ నిర్ణయించుకుంది. అందులో భాగంగా భారీ ఎత్తున స్కూటర్ల తయారీకి రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ఓలా సంస్థ తమిళనాడులో కృష్ణగిరి జిల్లాలో 500 ఎకరాల్లో ఓలా స్కూటర్‌ గిగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. సింపుల్‌ వన్‌ అంతకంటే పెద్దగా ఏకంగా 600 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించింది.

గిగా ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సింపుల్‌ వన్‌ సంస్థ సైతం తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. మొత్తం రెండు దశల్లో ఆరు వందల ఎకరాల్లో గిగా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇప్పటికే సింపుల్‌ వన్‌కి హోసూరు జిల్లాలో  ఏడాదికి పది లక్షల స్కూటర్లను తయారు చేసే సామర్థ్యంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. దీనికి అదనంగా మరో ఫ్యాక్టరీని తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో నిర్మించనుంది.


సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ మొదటి దశ ఉత్పత్తి వచ్చే ఏడాది చివరి నాటికి జరుగుతుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. కాగా రెండో దశ 2023 చివరి నాటికి అందుబాటులోకి రానుంది. మొత్తంగా సింపుల్‌ వన్‌ రూ. 2500 కోట్లు పెట్టుబడికి రెడీ అయ్యింది. ఈ ఫ్యాక్టరీ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి లభించనుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement