దేశీయ స్టాక్‌ మార్కెట్‌, కొనసాగుతున్న నష్టాల పరంపర!

Sensex loses 372 points, Nifty below 16,000 - Sakshi

ముంబై: ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్‌ సూచీలకు మూడోరోజూ నష్టాలు తప్పలేదు. ఇంధన, బ్యాంకింగ్, ఐటీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో బుధవారం సెన్సెక్స్‌ 372 పాయింట్ల నష్టంతో 53,514 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 16,000 స్థాయి దిగువున 15,967 వద్ద నిలిచింది. మరోవైపు ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, మెటల్, రియల్టీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించాయి.

ఆర్థిక మాంద్యం భయాలు, కార్పొరేట్‌ ఫలితాలకు వెల్లడి ముందు అప్రమత్తత, డాలర్‌ మారకంలో రూపాయి సరికొత్త జీవితకాల కనిష్టానికి దిగిరావడం తదితర అంశాలు సెంటిమెంట్‌పై ఒత్తిడిని పెంచాయి. గత 3 సెషన్లలో సెన్సెక్స్‌ 967 పాయింట్లు, నిఫ్టీ 254 పాయింట్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,840 కోట్ల షేర్లను అమ్మేయగా.. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,799 కోట్ల షేర్లు కొన్నారు.  

ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ అమ్మకాల ఒత్తిడి  
భారత ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలకు తగ్గట్లు నమోదుకావడంతో పాటు అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడంతో దేశీయ మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 323 పాయింట్లు పెరిగి 54,210 వద్ద, నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 16,128 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రతికూల అంతర్జాతీయ సంకేతాలతో ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మిడ్‌సెషన్‌ కల్లా ఆరంభ లాభాల్ని కోల్పోయిన సూచీలు.., యూరప్‌ మార్కెట్ల నష్టాల ప్రారంభంతో మరింత ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(54,211) నుంచి 756 పాయింట్లు నష్టపోయి 53,455 వద్ద నిఫ్టీ 190 పాయింట్లను కోల్పోయి 15,950 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.  

మార్కెట్లో మరిన్ని సంగతులు  
తొలి త్రైమాసిక ఫలితాలు నిరాశపరచడంతో   హెచ్‌సీఎల్‌ టెక్‌ షేరు ఒక దశలో 2.5% నష్టపోయి రూ.905 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి ఒకశాతం పతనంతో రూ.918 వద్ద స్థిరపడింది.  
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ విచారణపై వివరణ ఇచ్చినప్పటికీ.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరుకు నష్టాలు తప్పలేదు. మూడున్నర శాతం నష్టంతో రూ. 818 వద్ద ముగిసింది.  
నష్టాల మార్కెట్లోనూ అరబిందో పార్మా, లారస్‌ ల్యాబ్స్, దివీస్, లుపిన్‌ షేర్లు 4–5% రాణించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top