ఆరు ఐపీఓలకు గ్రీన్‌ సిగ్నల్‌ | SEBI has green signal IPOs for six major companies | Sakshi
Sakshi News home page

ఆరు ఐపీఓలకు గ్రీన్‌ సిగ్నల్‌

May 10 2026 5:26 AM | Updated on May 10 2026 10:08 AM

SEBI has green signal IPOs for six major companies

జెప్టో సహా ఆరు కంపెనీలకు సెబీ అనుమతులు 

మార్కెట్‌ ఒడిదుడుకుల్లోనూ జోరుగా ఇష్యూలు 

వృద్ధి ప్రణాళికలతో ముందుకొస్తున్న సంస్థలు  

ముంబై: పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నప్పటికీ, దేశీయ ఐపీఓ మార్కెట్‌ మాత్రం ఆశావహ సంకేతాలు ఇస్తోంది. రుణ భారాన్ని తగ్గించుకోవడం, కార్యకలాపాలను విస్తరించుకోవడం, డైవర్సిఫికేషన్‌ లక్ష్యాలతో ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమైన ఆరు కంపెనీలకు తాజాగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతులు లభించాయి. తద్వారా ‘మూలధన సమీకరణకు మార్గాలు మూసుకుపోలేదు’ అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌ ఒడిదుడుకులను లెక్కచేయకుండా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఈ ఐపీఓలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  

విభిన్న రంగాలకు చెందిన జెప్టో, ధూత్‌ ట్రాన్స్‌మిషన్, హొరైజన్‌  ఇండ్రస్టియల్‌ పార్క్స్, సర్జివేర్, క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్, హోటల్‌ పోలో టవర్స్‌ అక్టోబర్‌–ఫిబ్రవరి మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు సమరి్పంచాయి. మే 4 నుంచి 8 మధ్య ఈ దరఖాస్తులను పరిశీలించిన సెబీ, పబ్లిక్‌ ఇష్యూలకు అనుమతులు మంజూరు చేసింది. ఐపీఓలు విజయవంతమైతే ఈ కంపెనీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో లిస్ట్‌ కానున్నాయి. రాబోయే ఐపీవోల వివరాలివీ.. 

జెప్టో రూ.11,000 కోట్ల ఇష్యూ 
క్విక్‌ కామర్స్‌ యూనికార్న్‌ సంస్థ జెప్టో ప్రస్తుతం మార్కెట్లో బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ వంటి దిగ్గజాలతో పోటీపడుతోంది. త్వరలో స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రాథమిక మార్కెట్‌ నుంచి దాదాపు రూ.11 వేల కోట్లు సమీకరించాలనే లక్ష్యంతో పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. సెబీ తాజా అనుమతులతో షేరు ధరల శ్రేణి, సబ్ర్‌స్కిప్షన్‌ తేదీలు, లిస్టింగ్‌ వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు కంపెనీ సన్నద్ధం కానుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్, స్టార్టప్‌ ఐపీఓలపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్న వేళ జెప్టో పబ్లిక్‌ ఆఫర్‌కు రావడం గమనార్హం. లిస్టింగ్‌ పూర్తైతే ఇప్పటికే స్టాక్‌ ఎక్సే్చంజీల్లో ఉన్న జొమాటో, స్విగ్గీ సరసన జెప్టో చేరనుంది.  

ధూత్‌ ట్రాన్స్‌మిషన్‌ 
ఆటో ఉపకరణాల తయారీ సంస్థ ధూత్‌ ట్రాన్స్‌మిషన్‌ ఐపీఓ ద్వారా దాదాపు 250 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2,258 కోట్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తాజా షేర్ల జారీతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) కూడా ఇందులో భాగంగా ఉంటుంది. అయితే ప్రమోటర్లు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా తమ వాటాలను విక్రయించబోరని సమాచారం. కంపెనీలో బెయిన్‌ క్యాపిటల్‌ పెట్టుబడులు ఉన్నాయి.  

→ జెప్టో, ధూత్‌ ట్రాన్స్‌మిషన్‌ సంస్థలు ‘కాని్ఫడెన్షియల్‌ ప్రీ–ఫైలింగ్‌ రూట్‌’ను ఎంచుకున్నాయి. ఈ విధానం ద్వారా ముసాయిదా పత్రాలను బహిరంగపరచకుండానే సెబీ నుంచి ప్రాథమిక అనుమతులు పొందే అవకాశం లభిస్తుంది. 

హొరైజన్‌  ఇండస్ట్రియల్‌ పార్క్స్‌
బ్లాక్‌స్టోన్‌ పెట్టుబడులున్న హొరైజన్‌ ఇండ్రస్టియల్‌ పార్క్స్‌ ఐపీఓ ద్వారా రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఇది పూర్తిగా తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఉంటుంది. ఓఎఫ్‌ఎస్‌ లేదు. సమీకరించే నిధుల్లో సుమారు రూ.2,250 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది.  

సర్జివేర్‌
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మెడికల్‌ డివైసెస్‌ తయారీ సంస్థ సర్జివేర్‌ తన వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగా ఐపీఓకు సిద్ధమైంది. తాజా ఈక్విటీల జారీ ద్వారా రూ. 370 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్‌ ఘనశ్యామ్‌ దాస్‌ అగర్వాల్‌ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా మరో రూ.370 కోట్ల ఈక్విటీలను విక్రయించనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త యంత్రాల కొనుగోలు, తయారీ సామర్థ్యాల పెంపు, రుణాల చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 

క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ 
వ్యవసాయ పంటల రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థ క్రిస్టల్‌ క్రాప్‌ ప్రొటెక్షన్‌ రూ.600 కోట్ల తాజా షేర్ల జారీతో ఐపీఓకు రానుంది. అదనంగా ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు 74.05 లక్షల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. ఇందులో ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, ఐఎఫ్‌సీ ఎమర్జింగ్‌ ఆసియా ఫండ్‌ వాటాలను విక్రయించనున్నాయి. సమీకరించే నిధులను రుణాల చెల్లింపు, అనుబంధ సంస్థ సఫైర్‌ క్రాప్‌ సైన్స్‌ మూలధన అవసరాలు, భవిష్యత్‌ కొనుగోళ్లు, వ్యూహాత్మక విస్తరణకు వినియోగించనుంది. 

హోటల్‌ పోలో టవర్స్‌ 
హాస్పిటాలిటీ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న హోటల్‌ పోలో టవర్స్‌ సంస్థ ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్ల జారీ చేయనుంది. ప్రమోటర్లు ఓఎఫ్‌ఎస్‌ ద్వారా 71.2 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టనున్నారు. తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధులను కొత్త హోటల్‌ ప్రాజెక్టుల అభివృద్ధి, అప్పుల తగ్గింపు, మౌలిక సదుపాయాల విస్తరణ, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సంస్థ ప్రధానంగా ఈశాన్య, తూర్పు, ఉత్తర భారతదేశాల్లో ‘పోలో’, ‘మ్యాక్స్‌’ బ్రాండ్ల పేరుతో అప్‌స్కేల్, మిడ్‌స్కేల్‌ హోటళ్లు, రిసార్ట్స్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తోంది.

మే 12న ఆర్‌ఎఫ్‌బీఎల్‌ ఫ్లెక్సీ ఇష్యూ షురూ.. 
ఫ్లెక్సిబుల్‌ ప్యాకింగ్‌ మెటీరియల్స్‌ తయారీదారు ఆర్‌ఎఫ్‌బీఎల్‌ ఫ్లెక్సీ ప్యాక్‌ ఐపీఓ ఈ నెల 12న ప్రారంభమై 14న ముగియనుంది. ధరల శ్రేణి రూ. 47–50గా కంపెనీ నిర్ణయించింది. కంపెనీ రూ.35.32 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఈ ఇష్యూకు వస్తోంది. ఇష్యూ ద్వారా కంపెనీ 70.65 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి రూ.35.32 కోట్ల సమీకరించనుంది. మే 11న యాంకర్‌ ఇన్వెస్టర్‌ బిడ్డింగ్‌ ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement