
మహిళా ఎంట్రప్రెన్యూర్లకు పూచీకత్తు లేకుండా, తక్కువ వడ్డీ రేటుపై రుణాలు అందించేలా ’అస్మిత’ పథకాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రవేశపెట్టింది. మహిళల సారథ్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు డిజిటల్ మాధ్యమం ద్వారా వేగవంతంగా, సులభతరంగా రుణ సదుపాయం లభించేందుకు ఇది ఉపయోగపడుతుందని బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
వినియోగ ప్రయోజనాల కోసం రుణాలు తీసుకోవడానికి ఇష్టపడే మహిళలు వ్యాపార రుణాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ ఆవిష్కరణ జరగడం గమనార్హం. ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రకారం.. మహిళలు తీసుకున్న రుణాలలో కేవలం 3 శాతం మాత్రమే వ్యాపార ప్రయోజనాల కోసం, 42 శాతం వ్యక్తిగత రుణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్, హోమ్ ఓనర్షిప్ వంటి పర్సనల్ ఫైనాన్స్ ఉత్పత్తుల కోసం, 38 శాతం బంగారంపై ఉన్నాయి.
మరోవైపు, మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించిన రూపే ఆధారిత ’నారీ శక్తి’ ప్లాటినం డెబిట్ కార్డును కూడా బ్యాంకు ఆవిష్కరించింది. ఇక మరో ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ప్రవాస భారతీయులలో మహిళల కోసం 'బీవోబీ గ్లోబల్ ఉమెన్ ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ సేవింగ్స్ అకౌంట్' పేరిట ప్రత్యేక ఖాతాను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment