విశాఖ స్టీల్‌ప్లాంట్‌ టర్నోవర్‌ రూ.18 వేల కోట్లు

RINL-VSP achieves a turnover of Rs 18,000 crore - Sakshi

విశాఖపట్టణం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2020–21లో  రూ.18 వేల కోట్లు టర్నోవర్‌ సాధించింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రారంభించిన నాటి నుంచి ఇదే రెండో అత్యధిక టర్నోవర్‌ కావడం విశేషం. గురువారం స్టీల్‌ప్లాంట్‌ ఉన్నతాధికారుల వర్చువల్‌ సమావేశంలో సీఎండీ పి.కె.రథ్‌ గత ఏడాది ప్లాంట్‌కు సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ వ్యవధిలో 4.45 మిలియన్‌ టన్నులు అమ్మకాల ద్వారా 13 శాతం వృద్ధి సాధించామన్నారు. గత నాలుగు నెలల్లో రూ. 740 కోట్లు నికర లాభం సాధించామన్నారు. మార్చి నెలలో ఎన్నడూ లేని విధంగా 7.11 లక్షల టన్నులు అమ్మకాలతో రూ.3,300 కోట్లు టర్నోవర్‌ జరిగిందన్నారు. గత ఏడాది మార్చి నెలలో రూ. 2,329 కోట్లు అమ్మకాలు చేయగా ఈ ఏడాది 42 శాతం వృద్ధి సాధించడం జరిగిందన్నారు.

2020 డిసెంబర్‌ నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కంపెనీ ప్రగతికి ముఖ్య కారణమన్నారు. అదే విధంగా ఈ ఏడాది 1.3 మిలియన్‌ టన్నులు విదేశాలకు ఎగుమతులు చేయడం ద్వారా గత ఏడాది కంటే 261 శాతం వృద్ధి సాధించామన్నారు. ఈ ఏడాది సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల్లో భాగంగా కోవిడ్‌–19 సందర్భంగా పీఎం కేర్స్‌ ఫండ్‌కు ఇచ్చిన రూ.5 కోట్లతో పాటు మొత్తం రూ.10 కోట్లు వ్యయం చేశామన్నారు. రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ఈ వారంలో ప్రారంభం కానుందన్నారు. ఉక్కు ఉత్పత్తి, అమ్మకాల కోసం విశేషంగా కృషి చేసిన ఉద్యోగులను ఆయన అభినందించారు. డైరెక్టర్‌ (కమర్షియల్‌) డి.కె.మొహంతి, డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌)కె.కె.ఘోష్, డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) ఎ.కె. సక్సేనా, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ (సీవీఓ) కె.వి.ఎన్‌. రెడ్డి పాల్గొన్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top