రిలయన్స్‌ లాభాల రికార్డ్‌!

RIL Q4 Results: Reliance Q4 net profit at Rs 19,299 cr beats estimates - Sakshi

క్యూ4లో నికర లాభం రూ. 19,299 కోట్లు 

కంపెనీ చరిత్రలోనే అత్యధికం

రూ. 10 లక్షల కోట్లకు ఆదాయం  

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో సరికొత్త రికార్డును సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నికర లాభం 19 శాతం ఎగసి రూ. 19,299 కోట్లను తాకింది. ఒక త్రైమాసికానికి కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. అంతక్రితం ఏడాది(2021–22) క్యూ4లో రూ. 16,203 కోట్లు మాత్రమే ఆర్జించింది. రిటైల్, టెలికం విభాగాలతోపాటు చమురు, పెట్రోకెమికల్స్‌ బిజినెస్‌ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2.14 లక్షల కోట్ల నుంచి రూ. 2.19 లక్షల కోట్లకు బలపడింది.

ఇక మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి రూ. 66,702 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది కూడా సరికొత్త రికార్డుకాగా.. 2021–22లో రూ. కేవలం 60,705 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరింది. 2021–22లో రూ. 7.36 లక్షల కోట్ల ఆదాయం మాత్రమే అందుకుంది. పూర్తి ఏడాదికి ఆర్‌ఐఎల్‌ నిర్వహణ లాభం(ఇబిటా) తొలిసారి రూ. 1,54,691 కోట్లను తాకింది. ఇది 23 శాతం వృద్ధి. ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు రూ. 1,41,809 కోట్లుకాగా.. కంపెనీవద్దగల రూ. 1,93,282 కోట్ల నగదు బ్యాలెన్స్‌ను మినహాయిస్తే నికర రుణ భారం వార్షిక ఇబిటాకంటే తక్కువగా రూ. 1,10,218 కోట్లుగా నమోదైంది. 
 
అన్ని విభాగాల జోరు: క్యూ4లో ఆర్‌ఐఎల్‌ ఇబిటా 22 శాతం జంప్‌చేసి రూ. 41,389 కోట్లను తాకింది. రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌(ఓటూసీ) ఇబిటా 14 శాతంపైగా ఎగసి రూ. 16,293 కోట్లకు, టెలికంసహా డిజిటల్‌ సర్వీసులు 17 శాతం మెరుగుపడి రూ. 12,767 కోట్లకు, రిటైల్‌ విభాగం 33 శాతం దూసుకెళ్లి రూ. 4,769 కోట్లకు, ఆయిల్, గ్యాస్‌ ఇబిటా రెట్టింపై రూ. 3,801 కోట్లకు చేరాయి. డీజిల్, ఏటీఎఫ్‌ ఎగుమతులపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ లాభాలపై రూ. 711 కోట్లమేర ప్రభావం చూపినట్లు ఆర్‌ఐఎల్‌ పేర్కొంది. అంతక్రితం క్యూ4లో రూ. 1,898 కోట్లమేర ప్రభావం పడినట్లు ప్రస్తావించింది.
ఆర్‌ఐఎల్‌ షేరు స్వల్ప వృద్ధితో 2,351 వద్ద క్లోజైంది. మార్కెట్‌ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి.

రిలయన్స్‌ రిటైల్‌ భళా
గతేడాది(2022–23) క్యూ4(జనవరి–మార్చి)లో రిలయన్స్‌ రిటైల్‌ నికర లాభం 13 శాతం వృద్ధితో రూ. 2,415 కోట్లను తాకింది. 2021–22 క్యూ4లో రూ. 2,139 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 21 శాతం ఎగసి రూ. 61,559 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 50,834 కోట్ల అమ్మకాలు సాధించింది. ఆదాయంలో డిజిటల్, న్యూ కామర్స్‌ బిజినెస్‌ వాటా 17 శాతానికి చేరింది. ఇక మొత్తం స్టోర్ల సంఖ్య 18,040కు చేరింది. క్యూ4లో 2,844 స్టోర్లను జత చేసుకుంది.

సర్వీసులతో కలిపి క్యూ4లో ఆదాయం రూ. 69,267 కోట్లను తాకగా.. ఇబిటా 33 శాతం వృద్ధితో రూ. 4,914 కోట్లకు చేరింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మొత్తం ఆదాయం 32 శాతం జంప్‌చేసి రూ. 2,30,931 కోట్లను తాకింది. నికర లాభం 30 శాతం ఎగసి రూ. 9,181 కోట్లయ్యింది. సర్వీసులతో కలిపి స్థూల ఆదాయం రూ. 2,60,364 కోట్లుగా నమోదైంది. దేశీయంగా రిటైల్‌ రంగంలో రిలయన్స్‌ అత్యుత్తమ వృద్ధిని చూపుతున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈషా ఎం.అంబానీ పేర్కొన్నారు.

ఆర్థిక వృద్ధిలో భాగం
డిజిటల్‌ కనెక్టివిటీ, ఆర్గనైజ్‌డ్‌ రిటైల్‌ విభాగాలలో కంపెనీ కార్యకలాపాలు వ్యవస్థాగత సామర్థ్యాలకు బలాన్నిస్తున్నాయి. తద్వారా ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్న ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నాయి. ఫైనాన్షియల్‌ సర్వీసుల విభాగాన్ని విడదీసి జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేరుతో లిస్ట్‌ చేయనున్నాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో ఎంజే ఫీల్డ్, ఆర్‌క్లస్టర్‌ తదితరాలతో కలిపి కేజీ–డీ6 బ్లాకులో గ్యాస్‌ ఉత్పత్తి రోజుకి 3 కోట్ల ప్రామాణిక ఘనపుమీటర్లకు చేరే వీలుంది.             
    –ముకేశ్‌ అంబానీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్, ఎండీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top