
ప్రసిద్ధ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచియిత రాబర్ట్ కియోసాకి ఎప్పుడూ బంగారం, వెండి, బిట్ కాయిన్‌ల గురించే మాట్లాడుతుంటారు. వాటి మీదే పెట్టుబడులు పెట్టాలని తన ఫాలోవర్లకు సూచిస్తుంటారు. తన ప్రాధాన్యతల నమూనాగా రూపొందించిన పోర్ట్ ఫోలియో అంటే బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లపై పెట్టిన పెట్టుబడులు 2025 లో ఇప్పటివరకు దాదాపు 40 శాతం పెరిగాయి.
ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి, బిట్‌కాయిన్‌లపై పెట్టిన పెట్టుబడులే "నిజమైన డబ్బు" అని రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) చెప్పే మాటకు ప్రాధాన్యత పెరిగింది. ఫిన్ బోల్డ్ రీసెర్చ్ విశ్లేషణ ప్రకారం.. సంవత్సరం ప్రారంభంలో బంగారం, వెండి, బిట్ కాయిన్.. ఈ మూడు ఆస్తులలో సమానంగా విభజించి 1,000 డాలర్లు పెట్టుబడి పెట్టారనుకుంటే ఆ పోర్ట్ ఫోలియో సెప్టెంబర్ 23 నాటికి 1,372.43 కు పెరిగింది.
ఏది ఎంతలా పెరిగిందంటే..
బంగారం (Gold) 43.06 శాతం లాభంతో ఔన్స్ కు 2,658 డాలర్ల నుంచి 3,754 డాలర్లకు పెరిగింది. వెండి మరింత బలమైన పనితీరును అందించింది. ఔన్స్ కు 29.57 డాలర్ల నుండి 43.89 డాలర్లకు అంటే 47.5 శాతం ఎగిసింది. ఇక బిట్ కాయిన్ 21.17% పెరిగింది. 94,388 డాలర్ల నుండి 113,080 డాలర్లకు చేరింది. వెండి అత్యధిక పనితీరు చూపినా మొత్తం మూడు ఆస్తులు పోర్ట్ ఫోలియో బలానికి అర్థవంతంగా దోహదపడ్డాయని ఫిన్ బోల్డ్ పేర్కొంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోనే రెండో ధనవంతుడు.. ఉన్నదంతా ఇచ్చేస్తున్నాడు!