అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల నడుమ పొరుగు దేశం పాకిస్థాన్ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. పాక్‌లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా సవరణ ప్రకారం, పెట్రోల్ ధర లీటరుకు రూ.6, హై-స్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డీ) ధర లీటరుకు రూ.6.80 మేర తగ్గాయి. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేశారు. పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించడం ఇది వరుసగా రెండో వారం కావడం గమనార్హం. గత వారం కూడా అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలను రూ.5 మేర తగ్గించారు.
సవరించిన కొత్త ధరల పట్టిక
ప్రభుత్వ తాజా నిర్ణయం తర్వాత పాకిస్థాన్‌లో లీటర్ ఇంధన ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.
| ఇంధనం రకం | పాత ధర (లీటరుకు) | తగ్గిన ధర | ప్రస్తుత ధర (లీటరుకు) |
|---|---|---|---|
| పెట్రోల్ | రూ. 409.78 | రూ. 6.00 | రూ. 403.78 |
| హై-స్పీడ్ డీజిల్ | రూ. 409.58 | రూ. 6.80 | రూ. 402.78 |
గమనిక: విలువ ఆధారంగా భారత రూపాయి, పాకిస్థాన్ రూపాయికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని గుర్తించాలి.(మే 25న 1 భారత రూపాయి=రూ.2.91 పాకిస్థాన్ రూపాయి)
అంతకుముందు ఆకాశాన్నంటిన ధరలు
ఫిబ్రవరిలో ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా వివాదం ప్రారంభమైనప్పటి నుంచి పాకిస్థాన్ ఇంధన మార్కెట్ తీవ్ర అస్థిరతకు గురైంది. అప్పటి నుంచి పాక్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం ధరలను సమీక్షిస్తోంది. గత కొన్ని నెలలుగా అక్కడ ధరలు ఏ స్థాయిలో పెరిగాయంటే..
మార్చి 6: ఇరాన్ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏకంగా రూ.55 పెంచారు.
ఏప్రిల్ 2: అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా పెట్రోల్ ధరల్లో 43 శాతం, డీజిల్ ధరల్లో 55 శాతం మేర భారీ వృద్ధిని ప్రకటించారు.
ఈ వరుస పెంపుదల కారణంగా ఒకానొక దశలో ఇంధన ధరలు దాదాపు మూడు రెట్లు(గరిష్టంగా రూ.445 వరకు) పెరిగి ప్రజలపై తీవ్ర భారాన్ని మోపాయి.
భారత్‌లో పరిస్థితి ఏంటి?
అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం భారతదేశంపై కూడా పడింది. అయితే, పాకిస్థాన్‌తో పోలిస్తే భారత్‌లో ఈ ధరల పెరుగుదల చాలా స్వల్పంగా, నియంత్రణలోనే ఉంది. ఇటీవలి కాలంలో నాలుగు విడతల సవరణల ద్వారా ఇంధన ధరలను మొత్తంగా సుమారు రూ.7 మేర పెంచారు. సోమవారం జరిగిన తాజా సవరణలో పెట్రోల్ ధరపై రూ.2.61, డీజిల్ ధరపై రూ.2.71 పెంచారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులను బట్టి రానున్న రోజుల్లో దేశీయ చమురు కంపెనీలు మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి


