ఆర్థిక అనిశ్చితులు, మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య సామాన్యుడి నుంచి సీనియర్ సిటిజన్ వరకు ప్రతి ఒక్కరూ కోరుకునేది ఒక్కటే..పెట్టిన పెట్టుబడికి భద్రత, చేతికి అందే లాభంలో స్థిరత్వం. ఈ రెండింటికీ భారతీయ తపాలా శాఖ చిరునామాగా నిలుస్తోంది. రూపాయి పోగొట్టుకునే ప్రమాదం లేకుండా ప్రభుత్వ గ్యారెంటీతో మార్కెట్ కంటే మెరుగైన వడ్డీని అందించే పోస్టాఫీస్ టాప్-3 హై-రిటర్న్ స్కీముల పూర్తి సమాచారం మీకోసం...
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్)
పెట్టుబడిదారుల సొమ్ముపై పోస్టాఫీసులో ప్రస్తుతం అత్యధిక వడ్డీని అందిస్తున్న పథకాల్లో ఇది మొదటి స్థానంలో నిలుస్తుంది. అరవై ఏళ్లు దాటిన వృద్ధులకు రిటైర్మెంట్ తర్వాత క్రమబద్ధమైన ఆదాయాన్ని, వారి జీవితకాల పొదుపుకు పూర్తి భద్రతను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది.
ప్రస్తుత వడ్డీ రేటు: 8.2% (ఇది ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఖాతాదారునికి చెల్లిస్తారు. దీన్ని నిబంధనల ప్రకారం సవరించే అవకాశం ఉంటుంది).
పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి(ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది) పెట్టవచ్చు. కాలపరిమితి 5 ఏళ్లు (మరో 3 ఏళ్లు పొడిగించుకోవచ్చు).
ఉదాహరణ..
ఒకవేళ మీరు ఈ స్కీమ్‌లో రూ.10 లక్షలు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత 8.2% వడ్డీ రేటు ప్రకారం మీకు ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.20,500 వడ్డీ రూపంలో లభిస్తుంది. అంటే ఐదేళ్ల కాలపరిమితి ముగిసేసరికి మీరు కేవలం వడ్డీ రూపంలోనే రూ.4,10,000 పొందుతారు. గడువు ముగిశాక మీ రూ.10 లక్షల అసలు మీకు సురక్షితంగా తిరిగి వస్తుంది.
సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై)
మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆమె భవిష్యత్తు అవసరాల (ఉన్నత చదువులు, వివాహం) కోసం భారీ నిధిని సమకూర్చడానికి ఇది ఓ ఉత్తమమైన స్కీమ్. ‘బేటీ బచావో బేటీ పఢావో’ ప్రచారంలో భాగంగా ఆడపిల్లల ఆర్థిక స్వాలంబన కోసం తీసుకొచ్చిన ప్రత్యేక దీర్ఘకాలిక పొదుపు పథకం ఇది. 10 ఏళ్లలోపు వయసున్న ఆడపిల్లల పేరు మీద తల్లిదండ్రులు ఈ ఖాతా తెరవవచ్చు.
ప్రస్తుత వడ్డీ రేటు: 8.2% (వార్షికంగా చక్రవడ్డీ లెక్కిస్తారు).
పెట్టుబడి పరిమితి: ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 15 ఏళ్ల పాటు డబ్బులు చెల్లించాలి. పాపకు 21 ఏళ్లు వచ్చేసరికి స్కీమ్ మెచ్యూర్ అవుతుంది.
ఉదాహరణ..
ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు గరిష్ట పరిమితి అయిన రూ.1.5 లక్షలు (నెలకు దాదాపు రూ.12,500) చొప్పున 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ఆమెకు 21 ఏళ్లు వచ్చేసరికి ఏకంగా సుమారు రూ.70 లక్షల వరకు భారీ మెచ్యూరిటీ మొత్తం లభిస్తుంది. ఇందులో విశేషం ఏమిటంటే ఈ మెచ్యూరిటీ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు.
కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)
రూపాయి రిస్క్ లేకుండా తమ పెట్టుబడి రెట్టింపు కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడితో పాటు పెట్టుబడి మొత్తాన్ని రెట్టింపు చేయడమే ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇందులో దేశంలోని ఏ వయోజనుడైనా ఒంటరిగా లేదా ఉమ్మడిగా(జాయింట్ అకౌంట్) పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రస్తుత వడ్డీ రేటు: 7.5% (చక్రవడ్డీ ఆధారంగా).
పెట్టుబడి పరిమితి: కనీసం రూ.1,000 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 115 నెలల్లో (9 ఏళ్ల 7 నెలలు) మీ డబ్బు రెట్టింపు అవుతుంది.
ఉదాహరణ..
మీరు కిసాన్ వికాస్ పత్రలో రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి మార్కెట్ రిస్క్ లేకుండా సరిగ్గా 115 నెలల తర్వాత మీ చేతికి రూ.10 లక్షలు అందుతాయి.
పై స్కీముల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
పోస్టాఫీస్ స్కీముల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా సులభం. మీ సమీపంలో ఉన్న ఏ పోస్టాఫీసునైనా సందర్శించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మొదట మీకు కావలసిన స్కీమ్‌కు సంబంధించిన దరఖాస్తు ఫారమ్‌ను పోస్టాఫీసులో తీసుకోవాలి (లేదా ఆన్‌లైన్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు). ఫారమ్‌ను పూర్తిగా భర్తీ చేసి దానికి అవసరమైన ధ్రువపత్రాలను జత చేయాలి. ప్రారంభ పెట్టుబడి మొత్తాన్ని నగదు రూపంలో లేదా చెక్కు రూపంలో చెల్లించి ఖాతాను ప్రారంభించవచ్చు. ఇప్పటికే పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా, నెట్ బ్యాంకింగ్ ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా కూడా కొన్ని స్కీముల్లో నేరుగా ఇన్వెస్ట్ చేయవచ్చు.
కావాల్సిన ముఖ్యమైన ధ్రువపత్రాలు
పోస్టాఫీసులో ఖాతా తెరవడానికి కింది ప్రాథమిక పత్రాలు తప్పనిసరి.
గుర్తింపు కార్డు: ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్ట్.
చిరునామా రుజువు: ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు.
ఇటీవలి కాలంలో తీసుకున్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎస్‌సీఎస్‌ఎస్ స్కీమ్ కోసం వయసు నిర్ధారించే సర్టిఫికేట్ లేదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందినట్లు ఆధారాలు.
ఎస్‌ఎస్‌వై కోసం ఆడపిల్ల పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల కేవైసీ పత్రాలు.
షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో భయపడేవారికి, రిటైర్డ్ ఉద్యోగులకు, పిల్లల భవిష్యత్తు కోసం పక్కా ప్లాన్‌తో పొదుపు చేయాలనుకునే వారికి పోస్టాఫీస్ స్కీములు ఒక సురక్షితమైన ఆర్థిక రక్షణ కవచం. ఇందులో లభించే సెక్షన్ 80సీ పన్ను మినహాయింపులు అదనపు ప్రయోజనం. మీ ఆర్థిక లక్ష్యాలకు సరిపోయే స్కీమ్‌ను ఎంచుకుని, ఆర్థిక నిపుణుల సలహాతో ఇప్పుడే పెట్టుబడిని ప్రారంభించండి.
ఇదీ చదవండి: ఆ ఒక్క ప్రశ్నతో సీనియర్ ఉద్యోగిపై వేటు!


