‘సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి?’-ఏదైనా ఆఫీసులో ఒక ఉద్యోగి తన పైఅధికారిని అడిగే అత్యంత సాధారణ ప్రశ్న ఇది. కానీ, నోయిడాకు చెందిన ఒక ప్రముఖ స్టార్టప్ సీఈవోకు మాత్రం ఈ ప్రశ్న తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎంతలా అంటే, ఆ ప్రశ్న అడిగినందుకు ఏకంగా ఒక సీనియర్ ఉద్యోగినే కొలువులోంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ వేదికగా కార్పొరేట్ కార్యాలయ సంస్కృతి, నాయకత్వ లక్షణాలపై చర్చకు దారితీసింది. ఆస్ట్రాలజీ స్టార్టప్ ‘ఇన్‌స్టాఆస్ట్రో’ వ్యవస్థాపకుడు, సీఈవో నితిన్ వర్మ స్వయంగా లింక్డ్‌ఇన్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
‘నిన్ను ఉద్యోగంలో పెట్టుకుంది ఇందుకేనా?’
లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో నితిన్ వర్మ ఈ సంచలన నిర్ణయాన్ని పంచుకుంటూ, తానే స్వయంగా ఆ సీనియర్ ఉద్యోగిని ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరించారు. ‘నేను ఒక ఉద్యోగిని తొలగించాను. ఎందుకంటే అతను నా దగ్గరకు వచ్చి.. సార్, తర్వాత ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు’ అని వర్మ రాసుకొచ్చారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘నేను వెంటనే అతని పనితీరును, ధోరణిని ప్రశ్నించాను. దానికి ఆ ఉద్యోగి సార్, నాకంటే మీకే బాగా తెలుసు కదా అని సమాధానమిచ్చాడు. అప్పుడు నేను.. అసలు నిన్ను ఈ ఉద్యోగంలోకి ఎందుకు నియమించుకున్నట్లు? అని అడిగాను’ అని వర్మ పేర్కొన్నారు.
పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా..
సదరు ఉద్యోగిని ఒక నిర్దిష్ట విభాగానికి పూర్తి బాధ్యుడిగా, స్వతంత్రంగా వ్యవహరించడానికి భారీ ప్యాకేజీతో నియమించుకున్నట్లు సీఈవో స్పష్టం చేశారు. కంపెనీ రోజువారీ కార్యకలాపాల్లో తాను జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ఆ నియామకం జరిగిందని తెలిపారు. సదరు సీనియర్ నిపుణుడికి మొదటి రోజు నుంచే ఎలాంటి మైక్రో మేనేజ్‌మెంట్, అప్రూవల్ చెయిన్ లేకుండా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. వ్యవస్థాపకులు లేదా మేనేజర్ల నుంచి నిరంతరం సూచనల కోసం వేచి చూడకుండా.. సమస్యలను ముందుగానే గుర్తించి, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడమే సీనియర్ ఉద్యోగుల బాధ్యత అని వర్మ వాదించారు.
అది వ్యక్తిగతంగా రావాల్సింది!
కార్యాలయంలో ఓనర్‌షిప్ (కంపెనీని తనదిగా భావించి పనిచేసే యాజమాన్య మనస్తత్వం) అనేది కాలక్రమేణా నాయకులు ఉద్యోగులకు నేర్పించే నైపుణ్యం కాదని, అది వ్యక్తిగతంగా రావాల్సిన మనస్తత్వమని వర్మ అభిప్రాయపడ్డారు. ‘మీరు యాజమాన్య బాధ్యతను ఎవరికీ బలవంతంగా ఇవ్వలేరు. ఉంటే వారే ఆ బాధ్యతతో ముందుకు పరిగెడతారు, లేదంటే వారు దానిని ఎప్పటికీ చేరుకోలేరు. యాజమాన్య బాధ్యత లేని స్వేచ్ఛ కేవలం గందరగోళానికి దారితీస్తుంది. ఏం ఆలోచించాలో కూడా నేనే చెప్పాల్సి వస్తే.. అలాంటి వ్యక్తులతో నేను సంస్థను నిర్మించలేను’ అని సీఈవో నితిన్ వర్మ స్పష్టం చేశారు.
నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్ వైరల్ కావడంతో లింక్డ్‌ఇన్ వినియోగదారులు, హెచ్ఆర్ నిపుణులు సీఈవో నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక సీనియర్ నిపుణుడికి కూడా కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తు వ్యూహాలపై స్పష్టత అవసరమని వాదిస్తున్నారు. ఎంత సీనియర్ అయినా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు వ్యవస్థాపకుడి విస్తృత వ్యూహానికి అనుగుణంగా ఉండాలని భావిస్తారు. అందుకోసమే చర్చలు జరుపుతారు అని కొందరు చెబుతున్నారు. సీనియర్లకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, ప్రతి చిన్న విషయానికి అనుమతులు లేదా స్పష్టత కోసం వ్యవస్థాపకుడిపై ఆధారపడకూడదని ఇంకొందరు అంటున్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!


