భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు! | Apple Expands Retail Network in India Bengaluru Set for Second Official Store | Sakshi
Sakshi News home page

భారత్‌లో మరో స్టోర్‌కు సన్నాహాలు!

May 21 2026 11:50 AM | Updated on May 21 2026 12:04 PM

Apple Expands Retail Network in India Bengaluru Set for Second Official Store

ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్లకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని తన రిటైల్ నెట్‌వర్క్‌ను భారీగా విస్తరిస్తోంది. ముంబై, ఢిల్లీల్లో ఇప్పటికే స్టోర్లను విజయవంతంగా నడుపుతున్న యాపిల్ తాజాగా ఐటీ హబ్ బెంగళూరులో తన రెండో అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

యాపిల్ తన అధికారిక కెరీర్ పేజీలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను ఉంచడంతో ఈ విస్తరణ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. కంపెనీ తన వెబ్‌సైట్‌లో బెంగళూరు ఈస్ట్ పరిధిలో పలు ఉద్యోగ ఖాళీలను జాబితాను విడుదల చేసింది. ఇందులో కస్టమర్-ఫేసింగ్ ఎగ్జిక్యూటివ్‌లు, టెక్నికల్ స్పెషలిస్టులు, మేనేజ్‌మెంట్ స్థానాలకు సంబంధించిన లీడర్‌షిప్ పాత్రలు ఉన్నాయి. ఉద్యోగ ప్రకటనలో బెంగళూరు ఈస్ట్ అని స్పష్టంగా పేర్కొనడం వల్ల.. ఈ కొత్త స్టోర్ ప్రముఖ ఐటీ కారిడార్ అయిన వైట్‌ఫీల్డ్-మహదేవపుర ప్రాంతంలోని ఫీనిక్స్ మార్కెట్‌సిటీ మాల్‌లో ఏర్పాటయ్యే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దేశవ్యాప్తంగా విస్తరణ..

గత కొన్ని నెలలుగా యాపిల్ దేశంలోని ప్రధాన నగరాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముంబైలోని బోరివలిలో రెండో స్టోర్, ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలోని నోయిడాలో మరొక స్టోర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు వచ్చిన కొద్ది నెలలకే బెంగళూరు ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం గమనార్హం. మరోవైపు, హైదరాబాద్‌లోనూ కొద్ది నెలల క్రితం ఇలాంటి ఉద్యోగ పోస్టింగ్‌లు కనిపించాయి. తాజా అంచనాల ప్రకారం హైదరాబాద్ స్టోర్ 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరు రెండో స్టోర్ 2027 ప్రారంభంలో ప్రారంభం కావచ్చు.

ఇదీ చదవండి: ఐఐటీ-బీ.. ఆఫర్లు తగ్గినా.. పెరిగిన ప్యాకేజీలు!

Advertisement
 
Advertisement
Advertisement