
వచ్చే మూడేళ్లలో ముప్పులు గణనీయంగా పెరిగే అవకాశం
ఫిషింగ్, డీడీవోఎస్, సోషల్ ఇంజినీరింగ్ రిస్క్ లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్వాంటమ్ కంప్యూటింగ్‌తో బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగానికి గణనీయంగా ముప్పు పొంచి ఉందని ఐఎస్‌బీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ (ఐఐడీఎస్) ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ రిస్కులను ఎదుర్కొనడానికి ఆయా రంగ సంస్థలు సన్నద్ధంగా ఉండాలని సూచించింది. సంప్రదాయ కంప్యూటర్ల పరిధికి మించిన సవాళ్లను పరిష్కరించేందుకు క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలపై పని చేసే విప్లవాత్మకమైన కంప్యూటింగ్ విధానమే క్వాంటమ్ కంప్యూటింగ్.
సంప్రదాయ కంప్యూటర్లు, బిట్స్ (0 లేదా 1)ను ఉపయోగించి సమాచారాన్ని ప్రాసెస్ చేస్తాయి. సంక్లిష్టమైన విషయాలను ప్రాసెస్ చేయడంలో వాటి సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి. మరోవైపు క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి సమస్యలను పరిష్కరించేందుకు సూపర్‌పొజిషన్, టనెలింగ్, ఇంటర్‌ఫియరెన్స్‌లాంటి క్వాంటమ్ ఫిజిక్స్ సూత్రాలను కూడా ఉపయోగిస్తాయి. ఈ విభాగంలో పలు కొత్త ఆవిష్కరణలు వస్తున్నప్పటికీ, ఎర్రర్ రేట్‌లను తగ్గించడం, పెద్ద స్థాయిలో విస్తరించడం వంటి అంశాల్లో సవాళ్లు ఉంటున్నాయి. క్వాంటమ్ కంప్యూటర్లు స్వభావరీత్యా సున్నితమైనవిగా ఉంటాయి.
దీంతో చుట్టుపక్కల ఏ కాస్త గందరగోళ పరిస్థితి ఉన్నా, అవి ప్రభావితమై తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సామర్థ్యాలు పెరిగే కొద్దీ హ్యాకర్లు ఎలాంటి సంక్లిష్టమైన ఎన్‌క్రిప్షన్‌నైనా ఛేదించగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలకు ముప్పులు పొంచి ఉన్నాయి. దేశీయంగా బీఎఫ్‌ఎస్‌ఐ రంగానికి క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల పొంచి ఉన్న ప్రత్యేకమైన సవాళ్లను అర్థం చేసుకునేందుకు, వాటిని అధిగమించేందుకు తీసుకోతగిన చర్యల గురించి ఈ నివేదిక కీలకంగా ఉంటుందని ఐఎస్‌బీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్ర ప్రొఫెసర్ మనీష్ గంగ్వార్ తెలిపారు.
నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు..
→ ఈ అధ్యయనానికి సంబంధించిన సర్వేలో పాల్గొన్న వారిలో 57.5 శాతం మంది వచ్చే మూడేళ్లలో క్వాంటమ్ కంప్యూటింగ్ గణనీయమైన ముప్పుగా పరిణమించవ్చచని భావిస్తున్నట్లు తెలిపారు. అత్యంత సాధారణంగా ఎదురయ్యే ముప్పుల్లో ఫిషింగ్ దాడులు (65 శాతం), డీడీవోఎస్ దాడులు (47.5 శాతం), సోషల్ ఇంజినీరింగ్ (40 శాతం) ఉండొచ్చని వారు పేర్కొన్నారు.
→ బీఎఫ్‌ఎస్‌ఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లలో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి అవగాహన ఒక మోస్తరుగానే ఉంది. క్వాంటమ్ కంప్యూటర్ల ముప్పులను కూడా అధిగమించగలిగే క్రిప్టోగ్రఫీని (పీక్యూసీ) అమలు చేసే సన్నద్ధత అంతంతమాత్రంగానే .. 5 పాయింట్లకు గాను సగటున 2.4 శాతం స్థాయిలో ఉంది. ఫైర్‌వాల్స్‌లాంటి సర్వసాధారణంగా ఉండే భద్రతా చర్యలను విస్తృతంగా అమలు చేస్తున్నప్పటికీ చొరబాట్లను గుర్తించే అధునాతన సిస్టంలు, బలహీనతలను సమర్ధవంతంగా అధిగమించగలిగే సాధనాలను వినియోగం తక్కువగానే ఉంటోంది.
→ టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్‌లో పురోగతి సాధించడంతో సైబర్‌సెక్యూరిటీ రిస్క్ ల తీరుతెన్నులు మారాయి. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో వ్యాపార వృద్ధి అవకాశాలు పెరిగినా, ప్రస్తుత పబ్లిక్ కీ క్రిప్టోగ్రఫీ (పీకేసీ) అల్గోరిథంలకు గణనీయంగా ముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సవాళ్లను అధిగమించేందుకు పీక్యూసీ వినియోగాన్ని వేగవంతం చేయడం, ప్రభుత్వం స్పష్టమైన ప్రమాణాలు .. మార్గదర్శకాలకు ప్రాధాన్యమివ్వడం, సైబర్‌సెక్యూరిటీపై అవగాహన పెంచడం, క్వాంటమ్‌ను నిలువరించే టెక్నాలజీలపై పరిశోధనలకు నిధులు సమకూర్చడం, పరిశ్రమవర్గాల మధ్య భాగస్వామ్యాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై దృష్టి పెట్టాలి.