మాన్యులైఫ్‌తో కలిసి జీవిత బీమా జాయింట్ వెంచర్
మొత్తం రూ. 7,200 కోట్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) తాజాగా బీమా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. జీవిత బీమాకు సంబంధించి కెనడాకు చెందిన మాన్యులైఫ్‌తో కలిసి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. ఇందులో రెండు సంస్థలకు చెరి 50 శాతం వాటాలు ఉంటాయి. దానికి తగ్గట్లుగా చెరి రూ. 3,600 కోట్లు చొప్పున మొత్తం రూ. 7,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నాయి.
ప్రాథమికంగా తొలి అయిదేళ్లలో రెండు సంస్థలు చెరో రూ. 1,250 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. రాబోయే పదేళ్లలో రూ. 18,000 కోట్లు–రూ. 30,000 కోట్ల వేల్యుయేషన్ స్థాయికి వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా తెలిపారు.
మహీంద్రా ఫైనాన్స్ నుంచి ఎంఅండ్‌ఎంకి అందే డివిడెండ్‌ను కొత్త వ్యాపారంలోకి ఇన్వెస్ట్ చేయనున్నట్లు చెప్పారు. దేశీయంగా ఇప్పటికీ బీమా కవరేజీ అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిశ్రమ వృద్ధికి గణనీయంగా అవకాశాలు ఉన్నట్లు షా తెలిపారు. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బీమా పరిశ్రమల్లో ఒకటైన భారత్ మార్కెట్లో ఎంట్రీ తమకు కీలక మైలురాయని మాన్యులైఫ్ ప్రెసిడెంట్ ఫిల్ విదరింగ్టన్ తెలిపారు.
మూడు నెలల్లో లైసెన్సుకు దరఖాస్తు..
వచ్చే రెండు, మూడు నెలల్లో లైసెన్సు కోసం బీమా రంగ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకోనున్నట్లు షా చెప్పారు. జాయింట్ వెంచర్ కార్యకలాపాలు ప్రారంభం కావడానికి 15 నుంచి 18 నెలల సమయం పడుతుందని వివరించారు. సాధారణంగా కొత్త వెంచర్లు బ్రేక్–ఈవెన్ సాధించేందుకు 10–12 ఏళ్లు పడుతుందని షా పేర్కొన్నారు.
గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాల్లో ఈ జాయింట్ వెంచర్‌ను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. జీవిత బీమాతో ప్రారంభించబోతున్న తమకు కాంపోజిట్ లైసెన్సు కూడా లభిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన తెలిపారు. మాన్యులైఫ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్‌కి ఆసియా, యూరప్, అమెరికావ్యాప్తంగా 3.6 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 37,000 మంది పైగా ఉద్యోగులు, 1.09 లక్షల మంది ఏజెంట్లు,, వేల సంఖ్యలో డి్రస్టిబ్యూషన్ పార్ట్‌నర్లు ఉన్నారు.
బీఎస్‌ఈలో గురువారం ఎంఅండ్‌ఎం షేర్లు 1.45% క్షీణించి రూ. 3,699 వద్ద ముగిశాయి.


