బెంగళూరుకు చెందిన ప్రముఖ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ ప్రోంటో ప్రస్తుతం సాంకేతిక, నైతిక వివాదంలో చిక్కుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలకు శిక్షణ ఇచ్చేందుకు కస్టమర్ల ఇళ్లలో వీడియోలను రికార్డ్ చేయడానికి తన సిబ్బందిని ఉపయోగించిందనే ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో టెక్ స్టార్టప్ ‘హ్యూమన్ ఆర్కైవ్’ వ్యవస్థాపకుడు రుషిల్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి.
నాడు ఎగతాళి చేశారు.. నేడు అదే చేస్తున్నారు
భవిష్యత్తులో రాబోయే హ్యూమనాయిడ్ రోబోట్లు, ఫిజికల్ ఏఐ వ్యవస్థల శిక్షణ కోసం మానవ ప్రవర్తన, కదలికలు, రియల్ వరల్డ్ పరస్పర చర్యలను (ఉదాహరణకు: లైవ్‌లో ఇళ్లు శుభ్రం చేయడం, వంట చేయడం, వస్తువులను సర్దడం) రికార్డ్ చేసే పనుల్లో ‘హ్యూమన్ ఆర్కైవ్’ సంస్థ నిమగ్నమై ఉంది. ఈ అంశంపైనే కొన్ని నెలల క్రితం (జనవరిలో) తాను ప్రోంటో వ్యవస్థాపకురాలు అంజలి సర్దానాతో చర్చించానని రుషిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ సమయంలో ఆమె తన ఆలోచనను తీవ్రంగా ఎగతాళి చేసిందని ఆయన ఆరోపించారు.
‘జనవరిలో నేను అంజలి సర్దానాతో మాట్లాడినప్పుడు ఆమె నన్ను చూసి నవ్వింది. ఇలాంటి డేటా సేకరిస్తున్నందుకు నన్ను ఒక తెలివితక్కువవాడిగా చిత్రీకరించింది. స్టార్టప్ వ్యవస్థాపకులను తక్కువ చేసి మాట్లాడటం ఆమెకు అలవాటు. కానీ ఇప్పుడు మార్కెట్ ట్రెండ్‌ను పట్టుకోవడానికి వాళ్లే ఆపసోపాలు పడుతున్నారు’ అని రుషిల్ తీవ్రస్థాయిలో విమర్శించారు.
ఏడాదిలో భారీ వాల్యుయేషన్.. కానీ..
23 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అంజలి సర్దానా నేతృత్వంలోని ప్రోంటో అతి తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. యూఎస్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన అంజలి గతంలో బైన్ క్యాపిటల్, 8వీసీ వంటి ప్రతిష్టాత్మక వెంచర్ సంస్థల్లో పనిచేశారు. ఏప్రిల్ 2025లో ప్రారంభమైన ఈ స్టార్టప్.. ఇళ్లు ఊడ్చడం, పాత్రలు కడగడం, వంటగది-బాత్రూమ్ క్లీనింగ్, లాండ్రీ వంటి సర్వీసుల కోసం కస్టమర్లను శిక్షణ పొందిన గృహ కార్మికులతో అనుసంధానిస్తుంది. ఇది ప్రారంభమైన ఏడాదిలోపే దీని వాల్యుయేషన్ 100 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ‘కెమెరా వివాదం’ సంస్థ ప్రతిష్టను మసకబార్చేలా కనిపిస్తోంది.
కెమెరాలు ఎందుకోసమంటే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ప్రోంటో కంపెనీ ఇళ్లలో కెమెరాలు పెట్టడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం. భవిష్యత్తులో మనుషులతో సంబంధం లేకుండా ఇళ్లలో స్వయంగా పనులు చేయగల హ్యూమనాయిడ్ రోబోట్లను తయారు చేయడానికి ఈ కెమెరా రికార్డింగులు అత్యంత కీలకం.
అది పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే..
కస్టమర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రోంటో సంస్థ అధికారికంగా స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘కస్టమర్లు స్వచ్ఛందంగా అంగీకరించి ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప సిబ్బంది ఇళ్లకు కెమెరాలతో వెళ్లరు. ఈ అనుమతి ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు, ప్రతి బుకింగ్‌కు ముందు కస్టమర్ దీన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ పైలట్ ప్రాజెక్ట్ కేవలం 0.1% మంది కస్టమర్ల వద్ద మాత్రమే నడుస్తోంది. దేశంలో అమలులో ఉన్న డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ (డీపీడీపీ) చట్ట నిబంధనలకు కట్టుబడే నెలల తరబడి కసరత్తు చేసి ఈ ప్రక్రియను రూపొందించాం’ అని సంస్థ తెలిపింది. ఏఐ, రోబోటిక్స్ రంగాన్ని మెరుగుపరచడమే దీని ముఖ్య ఉద్దేశమని, ఈ రంగంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న ఏకైక సంస్థ తమది మాత్రమే కాదని ప్రోంటో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: స్థిరమైన రాబడి.. నమ్మకమైన పెట్టుబడి


