విస్తరణపై ‘ప్రైవేట్‌’ దృష్టి పెట్టాలి

Private sector should look investment opportunities cpses: DIPAM Secretary - Sakshi

సీపీఎస్‌ఈలలో పెట్టుబడులకు సిద్ధం కండి 

దీపమ్‌ కార్యదర్శి టీకే పాండే సూచనలు 

న్యూఢిల్లీ: డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ సంస్థల (సీపీఎస్‌ఈ)లలో పెట్టుబడి అవకాశాలపై ప్రయివేట్‌ రంగం దృష్టి సారించాల్సి ఉందని దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను ఆర్థిక నిర్వహణగా కాకుండా సంస్కరణల కోణంలో చూడవలసిందిగా సూచించారు.

కార్పొరేట్‌ సుపరిపాలన కారణంగా సీపీఎస్‌ఈలు మెరుగైన పనితీరు చూపుతున్నాయని తెలిపారు.  దీంతో వాటాదారులకు సీపీఎస్‌ఈ షేర్లు స్టాక్‌ మార్కెట్‌ ఇండెక్సులతో పోలిస్తే అత్యుత్తమ  రిటర్నులు(లాభాలు) అందిస్తున్నట్లు తెలియజేశారు. దేశీ కంపెనీలు వృద్ధి బాటలో సాగడంతోపాటు దేశ, విదేశాలలో క్లిష్టతరహా బిజినెస్‌లను సైతం సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపు, ఉద్యోగ సృష్టి తదితర లబ్దిని చేకూర్చగల విస్తరణ అంశాలకు ప్రయివేట్‌ రంగం ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. సొంత సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోకుండా సంకోచాలు వీడి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవలసిందిగా దేశీ కార్పొరేట్లకు మంగళవారం ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించిన సంగతి తెలిసిదే.

ఈ నేపథ్యంలో పాండే అభిప్రాయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక విక్రయానికి దీపమ్‌ సుమారు ఏడు ప్రభుత్వ రంగ కంపెనీలను ఎంపిక చేసింది. ఈ జాబితాలో బీఈఎంఎల్, షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ), కంటెయినర్‌ కార్పొరేషన్‌(కంకార్‌), వైజాగ్‌ స్టీల్, ఐడీబీఐ బ్యాంక్, ఎన్‌ఎండీసీకి చెందిన నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్, హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ ఉన్నాయి.

ఐడీబీఐ బ్యాంక్‌ త్వరలో
ఐడీబీఐ బ్యాంక్‌ ప్రయివేటైజేషన్‌కు వీలుగా త్వరలో ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్‌(ఈవోఐ)కు తెరతీయనున్నట్లు దీపమ్‌ కార్యదర్శి పాండే వెల్లడించారు. బ్యాంక్‌ వ్యూహాత్మక విక్రయానికి 2021 మే నెలలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ(సీసీఈఏ) ఆమోదముద్ర వేసింది.

ప్రస్తుతం బ్యాంకులో ప్రమోటర్‌గా ఉన్న బీమా రంగ పీఎస్‌యూ ఎల్‌ఐసీకి 49.24 శాతం, ప్రభుత్వానికి 45.48 శాతం చొప్పున వాటా ఉంది. ప్రాథమిక బిడ్స్‌కు ఆహ్వానం పలికేముందు ప్రభుత్వం, ఎల్‌ఐసీ ఎంతమేర వాటాలు ఆఫర్‌ చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు పాండే తెలియజేశారు. ఫిక్కీ సీఏపీఏఎమ్‌ 2022 నిర్వహించిన 19వ వార్షిక క్యాపిటల్‌ మార్కెట్‌ సదస్సులో పాండే ఈ విషయాలు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top