అమెరికా-ఇరాన్ యుద్ధం.. ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తూ, దేశంలో ఖర్చులను పెంచుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మూడు ఎఫ్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. మూడు ఎఫ్‌లు - ఫ్యూయల్ (ఇంధనం), ఫర్టిలైజర్ (ఎరువులు), ఫారెక్స్ (విదేశీ మారక నిల్వలు).
పెరిగిన ధరలు - ప్రజలపై భారం!
ముంబైలో జరిగిన స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 37వ వార్షికోత్సవ కార్యక్రమంలో సీతారామన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎరువుల ధరలు ఊహకందని స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతోంది. కేవలం 11 రోజుల్లోనే పెట్రోల్ ధర లీటర్‌కు రూ.7.38 వరకు పెరిగిందని ఆమె పేర్కొన్నారు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి వద్ద ఏర్పడిన అంతరాయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు సరఫరా దెబ్బతింటోంది. భారతదేశం తన చమురు అవసరాల్లో దాదాపు 85-90 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే.. భారత్‌పై నేరుగా ప్రభావం పడుతుంది.
మోదీ పిలుపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ మారక నిల్వలను జాగ్రత్తగా ఉపయోగించాలని చెప్పారు. కాబట్టి, కొంతకాలం పాటు అవసరం లేని దిగుమతులను తగ్గించడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయడం, కొంతకాలం బంగారం కొనుగోళ్లను తగ్గించడం వంటి సూచనలు ప్రజలకు, పరిశ్రమలకు ప్రధాని ఇచ్చారని సీతారామన్ గుర్తుచేశారు.
ప్రస్తుతం భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల మాత్రమే సమస్య కాదు. ఎరువుల ధరలు భారీగా పెరగడం వల్ల వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడం కూడా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతోందని ఆర్ధికమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశాలన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను సృష్టిస్తున్నాయని ఆమె వివరించారు.
అనేక సమస్యలు ఒకేసారి!
అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావం కేవలం రాజకీయ లేదా దౌత్య పరమైన అంశం కాదు, ఇది సాధారణ ప్రజల జీవితాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని సీతారామన్ హెచ్చరించారు. ఇంధన ధరలు పెరగడం, సరుకు రవాణా ఆలస్యం కావడం, షిప్పింగ్ ఖర్చులు పెరగడం, పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకుల కొరత, ఎగుమతి ఆర్డర్లలో అనిశ్చితి వంటి అనేక సమస్యలు ఒకేసారి ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు.
పెరుగుతున్న ఇంధన ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారీ ఆదాయ నష్టాన్ని భరించిందని సీతారామన్ చెప్పారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం వల్ల ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయ నష్టం వచ్చినప్పటికీ ప్రజలపై భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) చెల్లింపుల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు 45 రోజుల్లోపు బకాయిలను చెల్లించాలని ఆమె సూచించారు.
ఇదీ చదవండి: ఉద్యోగాలపై AI ప్రభావం.. యువతకు పిచాయ్ సందేశం!


