కృత్రిమ మేధస్సు (AI) గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యువతలో.. విద్యార్థుల్లో ఏఐ తమ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందేమో అనే భయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
ఇటీవల 'హార్డ్ ఫోర్క్' అనే పాడ్‌కాస్ట్‌లో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. యువతపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపారు. ఏఐ వల్ల మార్పులు వచ్చినా, కొత్త తరం ఆ సవాళ్లను స్వీకరించి మంచి భవిష్యత్తును నిర్మిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో జరగబోయే పట్టభద్రుల సభలో పిచాయ్ ప్రసంగించబోతున్నారు. ఈ సందర్భంగా.. పాడ్‌కాస్ట్ హోస్ట్ ఏఐ గురించి మాట్లాడితే.. విద్యార్థులు విమర్శిస్తే, ఏమని జవాబిస్తారు? అని సరదాగా ప్రశ్నించారు. 'ప్రతి తరం సవాళ్లను ఎదుర్కొని ముందుకు సాగింది. ఈ తరం కూడా అలాగే సవాళ్లను అధిగమించి మంచి ప్రపంచాన్ని నిర్మిస్తుంది' అని పిచాయ్ సమాధానం ఇచ్చారు.
యువత, విద్యార్థులు ఏఐ ప్రభావాన్ని మాత్రమే అనుభవించరు. భవిష్యత్తులో ఏఐ అభివృద్ధిని ముందుకు నడిపించే ప్రధాన శక్తిగా కూడా మారతారు. వీళ్ళే AI పురోగతికి కారణమవుతారు, దాని ప్రభావాలను కూడా ఎదుర్కొంటారని పిచాయ్ వెల్లడించారు. యువత కొత్త అవకాశాలను సృష్టించే శక్తి కలిగిన వారని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల చాలా కంపెనీలు.. ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఏఐ అని చెబుతున్నారు. దీనివల్ల ఉద్యోగాల భద్రతపై మరింత ఆందోళన పెరిగింది. ముఖ్యంగా కొత్తగా చదువు పూర్తి చేసిన యువతలో నిరుద్యోగం కూడా పెరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు AI గురించి భయపడటం సహజమని పిచాయ్ అంగీకరించారు.
టెక్నాలజీలో వచ్చే మార్పులు ఎప్పుడూ సమాజంలో భయాన్ని కలిగిస్తాయి. గతంలో వచ్చిన సాధారణ సాంకేతిక మార్పులకు కూడా ప్రజలు భయపడ్డారు. కానీ.. తరువాత అవే అభివృద్ధికి దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. AIను కూడా సరైన విధంగా ఉపయోగిస్తే మానవ సమాజానికి ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు.
ఏఐ వల్ల జరిగే నష్టాలను మాత్రమే కాకుండా.. ప్రయోజనాలను కూడా ప్రజలకు స్పష్టంగా చూపించాల్సిన బాధ్యత టెక్నాలజీ రంగంపై ఉందని సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు, ప్రభుత్వాలు కలిసి బాధ్యతాయుతంగా AIని అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని పెంచేందుకు ఇంకా చాలా పని చేయాల్సి ఉందని ఆయన అంగీకరించారు.


