
అసలుకు ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడినిచ్చే పొదుపు పథకాలు పోస్టాఫీసుల్లో ఎన్నో ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ ఏడాది రెపో రేటును 1 శాతం తగ్గించింది. ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లో వరుసగా కోతలు విధించింది. దీనికి అనుగుణంగా బ్యాంకులు కూడా పొదుపు ఖాతాలపై వడ్డీని బ్యాంకులు తగ్గించాయి. కానీ పోస్టాఫీసుల్లో పథకాల వడ్డీ రేట్లు మాత్రం మారలేదు.
సురక్షితమైన పెట్టుబడితో ప్రతి నెలా స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం పోస్టాఫీసులో అద్భుతమైన పథకం ఉంది. అదే పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్) ఈ పథకంలో ఒకసారి ఏకమొత్తంలో మొత్తంలో పెట్టుబడి పెడితే దానిపై వడ్డీ ప్రతి నెలా వారి పొదుపు ఖాతాలో నేరుగా జమవుతుంది. ఈ పథకం 5 సంవత్సరాల పాటు ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత అసలు మొత్తం తిరిగి లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా రూ.9 లక్షలు డిపాజిట్ చేయొచ్చు. అదే జాయింట్ అకౌంట్ ద్వారా అయితే రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
వడ్డీ ఎంత వస్తుందంటే..
పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ 7.4% వార్షిక వడ్డీని (ఆగస్టు 2025 నాటికి) అందిస్తుంది. పెట్టుబడి పూర్తిగా సురక్షితం. ప్రతి నెలా గ్యారెంటీ వడ్డీని ఇస్తుంది. ఉదాహరణకు భార్యభర్తలిద్దరూ కలిసి ఉమ్మడి ఖాతాలో రూ .15 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా సుమారు రూ .9,250 వడ్డీ వస్తుంది. ఈ పథకం ప్రత్యేకమైనది ఎందుకంటే దాని వడ్డీ రేటు స్థిరంగా, బ్యాంకు కంటే ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి పెట్టుబడి చాలా సురక్షితం. ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పొందడం వల్ల క్రమం తప్పకుండా ఆదాయం లభిస్తుంది.