
కొరాపుట్(ఒడిషా): భార్యను చంపేసి.. ప్రమాదంగా చిత్రించాడో ప్రబుద్ధుడు. ఆయన పోలీసు కావడం విశేషం. కొరాపుట్ జిల్లా కేంద్రంలో ఓఎంపీ కాలనీలో ఐఆర్‌బీ జవాన్ శివ శంకర్ పాత్రో నివాసంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి అతని భార్య ప్రియాంక పండా మృతి చెందిన విషయం పాఠకులకు తెలిసిందే. అందరూ ఇది ప్రమాదమే అని అనుకున్నారు. కానీ ప్రియాంక తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి కొరాపుట్‌లో సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత కేసు మలుపు తిరిగింది. వారు తమ కుమార్తె మృతదేహం చూసి అనుమానం వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి పెద్ద బ్రాహ్మణ వీధికి చెందిన తరణి పండా తన కుమార్తె ప్రియాంకని నబరంగ్‌పూర్ జిల్లా డాబుగాంకి చెందిన ఐఆర్‌బీ కానిస్టేబుల్ శివ శంకర్ పాత్రోకి ఇచ్చి గత ఏడాది జులై 11న టెక్కలిలో వివాహం జరిపించారు. వివాహ సమయంలో 12 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు వరకట్నంగా ఇచ్చారు. నూతన దంపతులు కొరాపుట్ ఓఎంపీ కాలనీ నివాసం ఉండడంతో వారికి అవసరమైన సారె కింద ఇంటి సామగ్రి ఇచ్చారు. కానీ పెళ్‌లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం ప్రియాంకపై భర్త భౌతిక దాడులు చేసేవాడు. ఇది తెలిసి కన్నవారు తమ శక్తి మేరకు అదనపు కట్నం పంపుతుండేవారు. భర్త వేధింపులతో ప్రియాంక పుట్టింటికి వెళ్లి సెప్టెంబర్ 4న తిరిగి కొరాపుట్ వచ్చింది.
కానీ వేధింపులు ఆగలేదు. పుట్టింట తండ్రి ఆరోగ్య రీత్యా గత కొద్ది రోజులుగా వేధింపులు కన్నవారికి చెప్పలేదు. బుధవారం రాత్రి 8 గంటలకు వీడియో కాల్ ద్వారా ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడింది. 9 గంటలకు శివ శంకర్ తన ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది వెంటనే రమ్మని టెక్కలికి ఫోన్ చేశాడు. వెంటనే వీరందరూ కొరాపుట్ చేరుకొని అనుమానంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా మృతురాలి తలపై ఇనుప రాడ్డుతో మోది చంపినట్లు తెలిసింది.
దీంతో వెంటనే శివ శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రియాంక చనిపోయాక శివశంకర్ తన తల్లిని, ఏడు నెలల కుమార్తెను ఇంటి బయట కూర్చోబెట్టాడు. అనంతరం మృతదేహాన్ని దహనం చేసి ఇంటికి నిప్పంటించాడు. మొదటి అంతా ఇది అగ్ని ప్రమాదమే అనుకున్నారు. కానీ మృతురాలి తల్లిదండ్రులు రావడంతో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో శివ శంకర్ తన నేరం అంగీకరించారు.