
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) రూ.10 లక్షలు అంతకుమించిన చెక్కుల ఆమోదానికి కస్టమర్ల ధ్రువీకరణను అమల్లోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పేసిస్టమ్ (పీపీఎస్)ను అమలు చేయనుంది. రూ.10 లక్షలకు మించిన చెక్కు క్లియరెన్స్ కోసం వచ్చినప్పుడు కస్టమర్ ధ్రువీకరణను తీసుకోనుంది. తద్వారా చెక్కుల రూపంలో భారీ మోసాలకు చెక్ పెట్టొచ్చన్నది పీఎన్‌బీ అభిప్రాయంగా ఉంది.
ఆర్‌బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా 2021 జనవరి 1 నుంచి సీటీఎస్ విధానంలో రూ.50,000, అంతకుమించిన చెక్కులకు పీపీఎస్‌ను పీఎన్‌బీ అమలు చేస్తోంది. ఈ సదుపాయాన్ని పొందడం ఖాతాదారుల ఇష్టానికి వదిలేయాలని, రూ.5లక్షలకు మించిన చెక్కులకు బ్యాంకులు తప్పనిసరి చేయవచ్చని గతంలో ఆర్‌బీఐ బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.