రూ.50 లక్షలు దాటితేనే 30 శాతం
30 లక్షలపై 20 శాతమే
పీహెచ్‌డీసీసీఐ సూచన
ఆదాయపన్ను భారాన్ని గణనీయంగా తగ్గించాలని, 30% గరిష్ట పన్ను రేటును రూ.50 లక్షలకు మించిన ఆదాయానికే వర్తింపజేయాలని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) కేంద్రాన్ని కోరింది. వ్యక్తులు, పార్ట్‌నర్‌షిప్ సంస్థలు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్‌లకు సంబంధించి ఈ సూచన చేసింది. రూ.30 లక్షల వరకు ఆదాయంపై పన్ను 20% మించకూడదని, రూ.30–50 లక్షల ఆదాయంపై 25%గా ఉండాలని కోరింది. ప్రస్తుతం కొత్త పన్ను విధానంలో రూ.24 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను రేటు అమల్లో ఉంది. అదే పాత పన్ను విధానంలో రూ.10 లక్షలకు మించిన ఆదాయంపై 30% పన్ను చెల్లించాలి. బడ్జెట్‌కు ముందు పీహెచ్‌డీసీసీఐ తమ సూచనలను కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి అజయ్ శ్రీవాస్తవకు సమర్పించింది.
ఆదాయం తగ్గదు..
‘‘కార్పొరేట్ పన్నును సర్‌చార్జీ 35% నుంచి 25 శాతానికి తగ్గించినప్పటికీ.. 2018–19లో రూ.6.63 లక్షల కోట్ల పన్ను ఆదాయం కాస్తా 2024–25 నాటికి రూ.8.87 లక్షల కోట్లకు పెరిగింది. మోస్తరు పన్ను రేట్ల వల్ల నిబంధనల అమలు పెరుగుతుంది. ఇది మరింత ఆదాయానికి దారితీస్తుంది’’అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వ్యక్తులకు 30 % గరిష్ట పన్నుకు సర్‌చార్జీ 5–25 శాతం కలుపుకుని చూస్తే నికర పన్ను రేటు కొన్ని కేసుల్లో 39 % వరకు వెళుతున్నట్టు తెలిపింది. ఆదాయంలో 40 శాతం ప్రభుత్వానికే వెళుతోందని, దీంతో స్వీయ వినియోగానికి 60 శాతమే మిగులుతున్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: వేతనాలు.. అమెరికాలో పెరుగుదల Vs భారత్‌లో తగ్గుదల


