రోబోటిక్స్ రేస్‌లో ఓపెన్ఏఐ | OpenAI Enters Robotics Race Sam Altman Challenges Elon Musk's Tesla Optimus | Sakshi
Sakshi News home page

రోబోటిక్స్ రేస్‌లో ఓపెన్ఏఐ

Jun 1 2026 11:28 AM | Updated on Jun 1 2026 7:45 PM

OpenAI Enters Robotics Race Sam Altman Challenges Elon Musk's Tesla Optimus

టెస్లా ‘ఆప్టిమస్’కు పోటీగా సరికొత్త వ్యూహం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో కీలకంగా మారిన ‘ఓపెన్ ఏఐ’ ఇప్పుడు భౌతిక ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. కేవలం సాఫ్ట్‌వేర్, చాట్‌బాట్‌లకే పరిమితం కాకుండా రియల్‌-వరల్డ్‌ ఉపయోగం కోసం ఏఐ ఆధారిత రోబోలను తయారు చేయనున్నట్లు సంస్థ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం కంపెనీ భారీ ఎత్తున రోబోటిక్స్ ఇంజినీర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది. ఓపెన్ ఏఐ తీసుకున్న ఈ నిర్ణయం.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘టెస్లా ఆప్టిమస్’ హ్యూమనాయిడ్ రోబోట్‌కు నేరుగా సవాలు విసరడమేనని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత రోబో

సాషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా సామ్ ఆల్ట్‌మాన్ ఓపెన్ ఏఐ రోబోటిక్స్ రోడ్‌మ్యాప్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తుపై తనకున్న అంచనాలను తెలిపారు. ‘స్వల్పకాలికంలో భవిష్యత్తు మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, పారిశ్రామిక పనులను నిర్వహించడానికి నైపుణ్యం కలిగిన కార్మికులకు మద్దతుగా నిలిచే రోబోలపై మేము దృష్టి సారించాం. కానీ, మా దీర్ఘకాలిక లక్ష్యం చాలా పెద్దది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తిగత రోబోను కలిగి ఉండే రోజు వస్తుందని మేము ఊహిస్తున్నాం’ అని సామ్ ఆల్ట్‌మాన్ చెప్పారు.

ఈ వ్యాఖ్యలు ఎలాన్ మస్క్ గతంలో చేసిన ప్రకటనలను తలపిస్తున్నాయి. మస్క్ సైతం టెస్లా ఆప్టిమస్ రోబోను భవిష్యత్తులో ప్రతి ఇంట్లోనూ ఒక వ్యక్తిగత సహాయకుడిగా, పరిశ్రమల్లో కార్మికుడిగా మారుస్తామని చెప్పారు. దీంతో ఇప్పుడు టెక్ ప్రపంచంలో మస్క్ వర్సెస్ ఆల్ట్‌మాన్ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది.

ఓపెన్ ఏఐలో జనరేటివ్ ఏఐ ప్రాజెక్టులపై కీలక పాత్ర పోషించిన ఆదిత్య రమేష్ నేతృత్వంలోని ‘వరల్డ్ సిమ్యులేషన్ రీసెర్చ్’ విభాగం నుంచే ఈ రోబోటిక్స్ బృందం ఏర్పడిందని ఆల్ట్‌మాన్ వెల్లడించారు. గడిచిన సంవత్సర కాలంలో ఈ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందిందన్నారు. రోబోటిక్ సిస్టమ్స్‌కు ఏఐ సాఫ్ట్‌వేర్ మోడళ్లను అందించడంతోపాటు వాటికి అవసరమైన హార్డ్‌వేర్, ఆపరేషనల్ స్టాక్‌ను కూడా కో-డిజైన్‌ పద్ధతిలో ఓపెన్ ఏఐ స్వయంగా అభివృద్ధి చేయబోతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్లోబల్ టాలెంట్ కోసం ఓపెన్ ఏఐ వేట

రోబోటిక్స్ రంగంలో తమ పట్టును చాటుకునేందుకు ఓపెన్ ఏఐ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభావంతులను ఆహ్వానిస్తోంది. రోబోలను తయారు చేయడానికి కింది విభాగాల్లో నిపుణుల కోసం నియామకాలు ప్రారంభించింది.

  • ఫుల్-స్టాక్ హార్డ్‌వేర్ ఇంజినీర్లు

  • ఆపరేషన్స్ నిపుణులు

  • సిస్టమ్స్ ఇంజినీరింగ్ నిపుణులు

  • మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్‌) రీసెర్చర్లు

అసాధారణమైన ప్రతిభ, గతంలో సాధించిన విజయాల రికార్డు ఉన్న అభ్యర్థులు తమ వివరాలను నేరుగా ఓపెన్ ఏఐ రోబోటిక్స్ రిక్రూట్‌మెంట్ బృందానికి పంపవచ్చని సంస్థ తెలిపింది.

ఇదీ చదవండి: పాపులర్‌ ఉద్యోగాల వెంటే పడకండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement