డీప్‌ టెక్‌ స్టార్టప్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు రావాలి

Only 11percent tech investment in deep tech startups - Sakshi

నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌  

బెంగళూరు: దేశీ డీప్‌ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థలు వేగంగా ఎదిగేందుకు వాటికి ప్రారంభ దశలో మరింత ఎక్కువగా పెట్టుబడులు అందాల్సిన అవసరం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లో కేవలం 11 శాతం మాత్రమే డీప్‌ టెక్‌ స్టార్టప్‌లకు లభిస్తున్నాయని తెలిపారు. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డీప్‌ టెక్‌ స్టార్టప్‌ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండగా, దేశీయంగానూ వీటి నిధుల అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.

పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 25,000 పైచిలుకు టెక్‌ స్టార్టప్‌లు ఉండగా.. వీటిలో డీప్‌టెక్‌కు సంబంధించినవి 12 శాతం (3,000) మాత్రమే ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), డ్రోన్‌లు మొదలైన టెక్నాలజీపై డీప్‌ టెక్‌ సంస్థలు పని చేస్తుంటాయి.

ఇలాంటి సంస్థల పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి వాటి ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలు గుర్తించాలని దేవయాని ఘోష్‌ చెప్పారు. ప్రతిభావంతులు చాలా మందే ఉంటున్నప్పటికీ .. వారిని అందుకోవడం సమస్యగా మారిన నేపథ్యంలో సింగపూర్‌ వంటి దేశాల్లో మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసిన విధంగా ’స్టార్టప్‌ సర్వీసు’ను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. తద్వారా మూడు, నాలుగో సంవత్సరంలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఏడాది పాటు ఏదైనా టెక్‌ స్టార్టప్స్‌లోకి వెళ్లి పనిచేయొచ్చని పేర్కొన్నారు. ఆ రకంగా ప్రతిభావంతుల తోడ్పాటుతో            ఆయా అంకుర సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీపడవచ్చన్నారు.  

అవ్రా మెడికల్‌ రోబోటిక్స్‌లో ఎస్‌ఎస్‌ఐకి వాటాలు
న్యూఢిల్లీ: దేశీ మెడ్‌టెక్‌ స్టార్టప్‌ కంపెనీ ఎస్‌ఎస్‌ ఇన్నోవేషన్‌ తాజాగా అమెరికాకు చెందిన నాస్డాక్‌ లిస్టెడ్‌ కంపెనీ అవ్రా మెడికల్‌ రోబోటిక్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేసింది. దీనితో తమకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశించేందుకు అవకాశం లభించినట్లవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సుధీర్‌ పి. శ్రీవాస్తవ తెలిపారు. ’ఎస్‌ఎస్‌ఐ మంత్ర’  రూపంలో ఇప్పటికే తాము మేడిన్‌ ఇండియా సర్జికల్‌ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. అవ్రాతో భాగస్వామ్యం .. రోబోటిక్‌ సర్జరీలకు సంబంధించి వైద్య సేవల్లో కొత్త మార్పులు తేగలదని శ్రీవాస్తవ వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top