సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, పలు దేశాల నడుమ యుద్ధాలు, ముడి చమురు, బంగారం ధరలు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం భారత స్థిరాస్తి రంగంపై పడింది. దేశీయ రియల్టీ రంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయని వెస్టియాన్ నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయ రియల్టీలోకి 1.76 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అయితే 2025 క్యూ2లోని 1.80 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్లతో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల కాగా.. గతేడాది క్యూ3లోని 0.96 బిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్‌తో పోలిస్తే మాత్రం 83 శాతం అధికం.
2025 క్యూ3లోని సంస్థాగత పెట్టుబడులలో అత్యధికం వాణిజ్య సముదాయంలోకి వచ్చాయి. 79 శాతం వాటాతో ఈ విభాగంలోకి 1,397.21 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. ఇక, 11 శాతం వాటాతో నివాస సముదాయంలోకి 191.67 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి 85.79 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో డైవర్సివైడ్ విభాగంలోకి 84.82 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి.


