మార్కెట్ల దారెటు? నిపుణుల అంచనాలు | NSE Nifty may move higher: Market experts opinion | Sakshi
Sakshi News home page

మార్కెట్ల దారెటు? నిపుణుల అంచనాలు

Sep 19 2020 4:04 PM | Updated on Sep 19 2020 4:04 PM

NSE Nifty may move higher: Market experts opinion - Sakshi

ఆర్థిక గణాంకాలు, ఈ ఏడాది క్యూ1లో కంపెనీల ఫలితాలు వంటి అంశాల నేపథ్యంలో గడిచిన వారం మార్కెట్లు ఊగిసలాట మధ్య కదిలాయి. వీటికితోడు  పెరుగుతున్న కరోనా కేసులు, ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులు తదితర అంశాలు కొద్ది రోజులుగా మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతూ వస్తున్నాయి. మరోవైపు చైనాతో సరిహద్దు వద్ద వివాదాలు కొనసాగుతూనే ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఎలా సంచరించవచ్చన్న అంశంపై పలువురు నిపుణులు విభిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వీటిలో కొన్నిటిని తీసుకుంటే..

11,440 స్థాయి కీలకం
కొద్ది వారాలుగా పలు ప్రతికూలతల నడుమ దేశీ స్టాక్‌ మార్కెట్లు నిలదొక్కుకుంటూ వచ్చాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 11,440-11,620 పాయింట్ల స్వల్ప పరిధిలోనే ఊగిసలాటకు లోనవుతూ వస్తోంది. వచ్చే వారం నిఫ్టీకి 11,440 స్థాయి కీలకమని చెప్పవచ్చు. ఈ మద్దతు స్థాయికంటే దిగువకు చేరితే 11,200 వరకూ నీరసించవచ్చు.
- గౌరవ్‌ దువా, క్యాపిటల్ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌, షేర్‌ఖాన్

11,600 దాటితే..
పలు ప్రతికూల వార్తల నేపథ్యంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్లు బలపడుతూ వచ్చాయి. దీంతో నిఫ్టీ 11,290-11,600 పాయింట్ల పరిధిలోనే ఆటుపోట్లను చవిచూస్తూ వస్తోంది. వచ్చే వారం నిఫ్టీకి 11,600 స్థాయి కీలకమని చెప్పవచ్చు. ఈ స్థాయి వద్ద ఎదురయ్యే రెసిస్టెన్స్‌ను అధిగమిస్తే.. 12,100 వరకూ పురోగమించవచ్చు.
- గౌతమ్‌ షా, వ్యవస్థాపకుడు, ప్రధాన వ్యూహకర్త, గోల్డిలాక్‌ ప్రీమియం రీసెర్చ్

మరింత ముందుకు
సమీప భవిష్యత్‌లో మార్కెట్లు మరింత బలపడేందుకు వీలుంది. ఇందుకు బ్యాంకింగ్‌ రంగం దోహదపడవచ్చు. ఇప్పటికే మారటోరియం, రుణాల డిఫాల్ట్స్‌ వంటి ప్రతికూలతలు బ్యాంకింగ్‌పై ప్రభావం చూపాయి. ఇకపై గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవడం ద్వారా డిమాండ్‌కు వీలుంది. ఐటీ, ఫార్మా, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ పటిష్టంగా కనిపిస్తున్నాయి. 
- పంకజ్‌ పాండే, రీసెర్చ్‌ హెడ్‌, ఐసీఐసీఐ డైరెక్ట్‌

రికార్డులవైపు..
కరోనా కేసుల పెరుగుదల, చైనాతో సైనిక వివాదాలు, మార్చి కనిష్టాల నుంచి 50 శాతం ర్యాలీ చేయడం వంటి కారణాలతో ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. అయితే కోవిడ్‌-19 కట్టడికి రూపొందుతున్న వ్యాక్సిన్లు, ఆర్థిక రికవరీపై ఆశలు, కంపెనీల పనితీరుపై అంచనాలు, కేంద్ర బ్యాంకుల ప్యాకేజీలతో పెరిగిన లిక్విడిటీ వంటి అంశాలు ఇన్వెస్టర్లకు హుషారునిస్తున్నాయి. ఫలితంగా భవిష్యత్‌లో మార్కెట్లు కొత్త గరిష్టాలవైపు దృష్టి సారించే అవకాశముంది. 
- గోల్డ్‌మన్‌ శాక్స్‌, గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ రీసెర్చ్‌ నివేదిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement