
విస్తరణకు వీలుగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు ప్రమోటర్ గ్రూప్ కంపెనీలు తాజాగా రూ. 3,956 కోట్ల పెట్టుబడులు సమకూర్చాయి. ఒక్కో వారంట్‌కు రూ. 316.5 ధరలో కంపెనీ బోర్డు 50 కోట్ల వారంట్లను జారీ చేసింది. వెరసి ప్రమోటర్ సంస్థలు సిక్కా పోర్ట్స్ అండ్ టెర్మినల్స్, జామ్‌నగర్ యుటిలిటీస్ అండ్ పవర్‌కు 25 కోట్లు చొప్పున వారంట్లను అందుకున్నాయి.
తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఎన్‌బీఎఫ్‌సీ.. జియో ఫైనాన్షియల్ రూ. 3,956 కోట్లు అందుకుంది. ఈ ఏడాది జూలైలో ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ప్రమోటర్ గ్రూప్ సంస్థలకు మార్పిడికివీలయ్యే వారంట్ల జారీకి కంపెనీ బోర్డు అంగీకరించిన సంగతి తెలిసిందే. తద్వారా రూ. 15,825 కోట్లు సమీకరించేందుకు ప్రణాళికలు వేసింది.
ప్రమోటర్లుగా ముకేశ్ అంబానీ కుటుంబంతోపాటు.. ఇతర సంస్థలు ప్రస్తుతం కంపెనీలో ఉమ్మడిగా 47.12 శాతం వాటా కలిగి ఉన్నాయి. కాగా.. ఈ ఏడాది(2025–26) తొలి త్రైమాసికం(ఏప్రిల్–జూన్)లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం పుంజుకుని రూ. 325 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా రూ. 418 కోట్ల నుంచి రూ. 619 కోట్లకు జంప్ చేసింది.