నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్‌దేవ్
ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్‌లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచి్చతంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు. కనుక స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్‌ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.
ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.
నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీ
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్-2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్‌సీఎస్‌ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు.
ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్


